ప్రతీ ఏటా తెలంగాణ తెలుగు మహాసభలు : సీఎం కేసీఆర్

Tue,December 19, 2017 07:19 PM

Telangana Telugu Mahasabhalu will conduct every year says CM KCR

తెలుగు మహాసభలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
తెలుగు భాషను బతికించుకోవాలి
ఈ గడ్డ మీద చదవాలంటే తెలుగు తప్పనిసరి
జనవరి మొదటివారంలో తెలుగు భాషాభివృద్ధికి ప్రకటనలు


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా తెలుగు మహాసభలు నిర్వహించుకొని ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రెండు రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహించబడుతాయని సీఎం ప్రకటించారు. తెలుగు మహాసభల ముగింపు వేడులకు హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర ప్రజల తరపున సీఎం ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను సుసంపన్నం చేసినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సభలు విజయవంతమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 1974లో డిగ్రీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరై తిలకించాను అని సీఎం గుర్తు చేశారు. తెలుగు మహాసభలు గొప్పగా నిర్వహించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాషను బతికించుకునేందుకు నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతీ ఏటా రెండు రోజుల పాటు డిసెంబర్ నెలలో తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలన్న నిబంధనను అమలు చేస్తామని ఉద్ఘాటించారు. ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

భాషా పండితుల సమస్యలను పరిష్కారిస్తామని చెప్పారు. పదవీ విరమణ పొందిన భాషా పండితుల భృతి కోతను ఎత్తేస్తామని ప్రకటించారు. భాషా పండిత మిత్రులకు ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. తెలుగు భాష అభివృద్ధి కొరకు, ఒక అద్భుతమైన జీవ భాషగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రకటనలు చేయాలని భావించాను. కానీ ఇప్పుడు ప్రకటన చేయలేకపోతున్నామని సీఎం తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి విషయంలో వందల, వేల సూచలను వచ్చాయన్నారు. జనవరి మొదటి వారంలో భాషా సాహితీ సదస్సు నిర్వహించి భాషాభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు.

తెలుగు మహాసభలను సంతోషంగా నిర్వహించుకొని గొప్పగా ముందుకు వెళ్లామని తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి.. ప్రతీ ఒక్కరూ సభలను విజయవంతం చేసేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎదురైన సమస్యలను వచ్చే సభల్లో రానివ్వమని స్పష్టం చేశారు. నేను చెప్పిన పద్యాలకు పలువురు నన్ను అభినందించారు. ఒక నవ్వుల పద్యంతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అని ఆ పద్యం చదివి వినిపించి సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.


4215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles