తెలంగాణ కోడలైనందుకు గర్వపడుతున్నా..

Thu,November 3, 2016 08:15 AM

Telangana Kuchipudi artist Padmajareddy

హైదరాబాద్: ప్రపంచంలో ఏ స్త్రీకి దక్కని గౌరవం భారతీయ స్త్రీలకు దక్కుతుంది.. భారతీయ సంస్కృతీ సంప్రదాయానికి అంత గొప్ప విశిష్టత ఉంది. అందుకే ఎక్కడికి వెళ్లినా మన స్త్రీలకు చేతులెత్తి నమస్కరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్లుకు చెందిన నేను తెలంగాణ కోడలైనందుకు గర్విస్తున్నా. మా గ్రామానికి పక్కనే కూచిపూడి గ్రామం ఉండటంతో ఐదో ఏట నుంచే నృత్యం నేర్చుకోవాలనే తపన పెరిగింది. తెలంగాణ కళాకారిణిగా అత్యుత్తమ అవార్డు అందుకోవడం ఆ భగవంతుడి కృపేఅని అన్నారు ప్రముఖ కూచిపూడి కళాకారణి పద్మజారెడ్డి. నేటి యువత ఇంటర్నెట్‌లు, సినిమాలతో కాలం వెళ్ల దీస్తున్నారని, ఒత్తిడితో కూడుకున్న చదువులు మనస్సులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. అక్టోబర్ 4న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నమస్తే తెలంగాణతో మాట్లాడారు.

ఎనిమిదో ఏటనే హైదరాబాద్‌కు..
ఎనిమిదో ఏట హైదరాబాద్‌కు వచ్చి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు వద్ద ఉంటూ నృత్యంలో శిక్షణ తీసుకున్నా. నాకు నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో 1988లో వివాహం జరిగింది. నా కుమారుడు పేరిట ప్రణవ్ కూచిపూడి డ్యాన్స్ అకాడమీని స్థాపించా. దాదాపు 500 మంది స్టుడెంట్స్‌కు శిక్షణ ఇచ్చా. కొండాపూర్, అమీర్‌పేట్, జేఎన్‌టీయూలో మా సంస్థలున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు కూచిపూడి నృత్యంపై మక్కువ పెంచుకొని నా వద్దకు శిక్షణకు పంపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య పోకడల నుంచి యువత బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది శుభపరిణామం. ఈ నృత్యం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు అటు విద్యార్థులకు చదువుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువ మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణనివ్వాలన్నదే నా ఆకాంక్ష. మరుగున పడిపోతున్న మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయడం కోసమే శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా..అని అన్నారు పద్మజారెడ్డి.

దేశవిదేశాల్లో ప్రదర్శనలు..
భారత్‌తో పాటు కెనడా, సింగపూర్, థాయిలాండ్, యూరప్, ప్యారీస్, లండన్, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, మారిషష్, స్విట్జర్లాండ్, ఇటలీ, రష్యాలో దాదాపు ఇప్పటి వరకు మూడు వేలకు పైచిలుకు పద్మజారెడ్డి కూచిపూడి ప్రదర్శనలిచ్చారు.

విభిన్న విభాగాల్లో..
శివ హేల, భ్రూణ హత్యలు, కల్యాణ శ్రీనివాస చరితం, అన్నమయ్య పద నర్తన శోభ, శ్రీకృష్ణ పారిజాతం, రాధే శ్రీ కృష్ణామృత్, వజ్ర భారతి, సీతా స్వయంవరం, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్, నమస్తే ఇండియా, రామాయణం వంటి ఇతివృత్తంగా తీసుకొని కూచిపూడి నృత్య ప్రదర్శనలిచ్చారు.

అవార్డులు..
- దేశ మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మ చేతుల మీదుగా 1994లో నాట్య విశారదను అందుకున్నారు.
- 2005లో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్.
- 2006లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కళారత్న అవార్డు.
- అక్కినేని నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా ఏఎన్‌ఆర్ గోల్డ్ మెడల్.
- 2016 అక్టోబర్ 4న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు.


3029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS