అందుబాటులోకి ధరణి

Mon,January 21, 2019 10:50 AM

హైదరాబాద్ : భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో భూమికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు తెలిసేలా రూపొందించిన ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇకనుంచి రైతులు, ప్రజలు తమ భూములకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఇంటర్నెట్‌లో చూసుకోవచ్చు. ఎలాంటి వివాదాలులేకుండా క్లియర్‌గా ఉన్న (పార్ట్-ఏ) వ్యవసాయభూముల వివరాలన్నీ ధరణిలో పొందుపరిచారు. ఇంటర్నెట్‌లో dharani.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఈ వివరాలన్నీ లభిస్తాయి. రికార్డ్స్ ఆఫ్ రైట్ (ఆర్వోఆర్) చట్టం ప్రకారం భూమి యాజమాన్య హక్కులను ధ్రువీకరించే 1(బీ) పట్టాతోపాటు భూమి వివరాలను, స్వభావం, అనుభవదారుల వివరాలు తెలియజేసే పహాణీలను కూడా ఈ వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు. భూమి సర్వేనంబర్లకు సంబంధించిన స్కెచ్‌లను కూడా ధరణిలో అందుబాటులో ఉంచారు. పార్ట్-బీ లోని వివాదాలు పరిష్కారమైన భూముల వివరాలు కూడా ధరణిలో పొందుపరుచనున్నారు.


బాలారిష్టాలను అధిగమించి..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలమేరకు రెవెన్యూ బృందాలు రికార్డు స్థాయిలో కేవలం వందరోజుల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేశాయి. దాదాపు 97 శాతం భూములకు సంబంధించిన వివరాలను హేతుబద్ధంచేసి ప్రజలకు 1(బి) పట్టా కాగితాలను రైతుల ఇండ్లకు వెళ్లి అప్పగించారు. ఈ రికార్డులు ఆన్‌లైన్‌ద్వారాఅందరికీ అందుబాటులోకి తేవడంకోసం సీఎం కేసీఆర్ నిర్దేశంతో ధరణి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను, వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన సమస్యల కారణంగా భూరికార్డులను అప్‌లోడ్ చేయడం రెవెన్యూ అధికారులు బాలారిష్టాలను ఎదుర్కొన్నారు. ప్రతి భూమి రికార్డును అప్‌లోడ్‌చేసే సమయంలో తహసీల్దారు డిజిటల్ సంతకంచేయాల్సి ఉంటుంది. ఒక దశలో తహసీల్దార్లు డిజిటల్ సంతకాలుచేయడానికి 24 గంటలు కార్యాలయంలోనే ఉండి పనిచేయాల్సి వచ్చింది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వెయ్యికిపైగా క్లిక్స్ వస్తే వెబ్‌సైట్ పనిచేయలేని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ అధికారులు ఒక్కో సమస్యను అధిగమిస్తూ అన్ని భూ రికార్డులను అప్‌లోడ్‌చేసి ధరణిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

కోర్ బ్యాంకింగ్ విధానానికి మరికొంతకాలం
ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి వచ్చినప్పటికీ, కోర్ బ్యాంకింగ్ తరహాలో భూ లావాదేవీలు నిర్వహించేస్థాయికి ఈ సాఫ్ట్‌వేర్ ఇంకా అప్‌డేట్ కాలేదు. ఈ విధానం అమల్లోకి రావడానికి ఇంకొంతకాలం పట్టవచ్చు. ప్రస్తుతానికి కోర్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిగి, నకిరేకల్, వికారాబాద్‌లలో చేపట్టారు. రెండురోజులనుంచి పరిగిలో పూర్తిస్థాయిలో క్రయవిక్రయాలు కోర్‌బ్యాంకింగ్ ద్వారా సాగుతున్నాయి. ఈ విధానం ఇక్కడ సక్సెస్ కాగానే రాష్ట్రమంతా అమలుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే ఎవరికీ లంచాలు ఇచ్చేపని లేకుండా పూర్తిస్థాయిలో పారదర్శకంగా భూ క్రయవిక్రయాలకు చెందిన మ్యుటేషన్లు జరుగుతాయి.

ప్రస్తుతం అందిస్తున్న సేవలు
-ధరణి వెబ్‌సైట్ హోం పేజీ ఓపెన్ చేయగానే రైతులు వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న చిత్రాలతో, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హోం పేజీలో సర్వీసెస్, జీఐఎస్, ల్యాండ్ స్టేటస్, మీ-సేవ, సజెషన్స్, గ్రీవెన్సెస్ విభాగాలను ఏర్పాటుచేశారు. ఇందులో ల్యాండ్ స్టేటస్ ఓపెన్ చేస్తే.. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, గ్రామం, ఖాతానంబర్, సర్వేనంబర్ల వివరాలను కోరుతుంది. ఈ మేరకు వివరాలు నమోదుచేసి.. ఖాతా నంబర్‌పైగానీ, సర్వేనంబర్‌పైగానీ క్లిక్‌చేస్తే పూర్తివివరాలు వస్తాయి. ఇందులో ఆర్వోఆర్ 1(బీ) పట్టా, పహాణీలు ఉంటాయి. సర్వేనంబర్ స్కెచ్ కూడా మ్యాప్‌లో ఉంటుంది. వివరాలను స్కాన్ కాపీ కింద డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-జీఐఎస్ విభాగంలోకి వెళ్తే జిల్లా, డివిజన్, మండలం, గ్రామం ఎంపికచేసుకోవాల్సి ఉంటుం ది. తర్వాత సర్వేనంబర్లవారీగా గ్రామం మ్యాప్ వస్తుంది. దీంట్లో సర్వేనంబర్ల స్కెచ్ ఏవిధంగా ఉందో చూసుకోవచ్చు. దీనికింద లేయర్స్ వస్తుంది. దీనిని క్లిక్‌చేస్తే

విలేజీ మ్యాప్, సెలక్ట్ లేయర్‌లోకి వెళ్లి సర్వే నంబర్‌పై క్లిక్‌చేస్తే, ఆ సర్వేనంబర్‌లో ఉన్న భూమి విస్తీర్ణం అంతా తెలుస్తుంది. ఈ సర్వేనంబర్‌కు ఉన్న బై నంబర్లను కూడా తెలుసుకోవచ్చు. భువన్ ఎల్‌యూఎల్సీ (50కె) 2011-12 లో క్లిక్‌చేస్తే విలేజ్ మ్యాప్‌పై రంగులు వస్తాయి. కంప్యూటర్‌లో మరోపక్క ఆ రంగులు దేనిని చూపిస్తాయో సూచనలుంటాయి. దీని ద్వారా సదరు భూమి అర్బన్‌లో ఉందా? రూరల్‌లో ఉందా? మూనింగ్‌లో ఉందా? వ్యవసాయ పంటలు పండిస్తున్నారా? పంట ఏమైనా ఉందా? ఫారెస్ట్ ప్లాంటేషన్ ఉందా? ఇలా 28 రకాల వర్గీకరణలు కనిపిస్తాయి.

-ధరణి వెబ్‌సైట్ ద్వారా ఇకనుంచి భూమి యజమానులు తమ భూములకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను మీ- సేవ నుంచి పొందే అవకాశాన్ని కల్పించారు.
-భూమికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే గ్రీవెన్సెస్ ఆప్షన్ క్లిక్‌చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో దరఖాస్తుదారు పేరు, తండ్రిపేరు, జెండర్, ఈ మెయిల్ ఐడీ, అడ్రస్ ఫిలప్ చేయాలి, సమస్య ఏమిటో స్పష్టంగా భర్తీచేసి, ఎవరికి దరఖాస్తు చేస్తున్నామో ఆ కాలాన్ని కూడా సెలక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సిఉంటుంది. ఇందులో సమస్యను రెండువేల క్యారక్టర్లకు మించకుండా అప్‌లోడ్ చేయాలి. అలాగే జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, గ్రామంపేర్లతోపాటు భూమి ఖాతానంబర్‌కానీ సర్వేనంబర్‌కానీ నమోదుచేయాలి. ధరణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైతే గ్రామ నక్షా, పాత భూమి రికార్డుల ఆధారంగా సమస్యను పరిష్కరిస్తారు. అలాగే ఈ వెబ్‌సైట్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్‌ను కూడా కోరుతున్నది. సలహాలను రెండు వందల క్యారెక్టర్లకు మించకుండా ఇవ్వవచ్చు.

3784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles