టీచర్ ట్రైనింగ్, టెట్ ఉత్తీర్ణత ఉండాల్సిందే

Mon,September 11, 2017 11:00 AM

Teacher training and tet compulsory for private schools

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణ పొంది ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయనుంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారి జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు జారీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా గల ప్రైవేట్ పాఠశాలల్లో సగానికి పైగా టీచర్లు అర్హత లేని వారే ఉన్నట్లు సమాచారం. కొన్ని పాఠశాలల్లో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన వారున్నా వారిలో టెట్ అర్హత లేనివారు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్, డిగ్రీ చదివిన వారే అత్యధికంగా ప్రైవేట్ టీచర్లుగా పనిచేయడం గమనార్హం. ప్రభుత్వం తాజాగా టెట్ తప్పనిసరి ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు అర్హత గల వారితో బోధనకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారిలో సగానికి పైగా అనర్హులున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారు లేకపోవడంతో ఉన్న వారితోనే పాఠశాలల యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. కాస్త సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎక్కువ విద్యార్హత ఉన్న వారిని నియమించుకుంటే ఆ స్థాయిలో వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని పాఠశాలల యాజమాన్యాలు వారిని తీసుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంటర్, డిగ్రీ ఉతీర్ణత ఉన్న వారిని కొంత మేరకు శిక్షణనిచ్చి వారితోనే కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విద్యార్థులకు బోధించే వారికి నెలకు సుమారు రూ.5 నుంచి 6 వేల వరకు చెల్లిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో బోధించే వారికి రూ.8 వేలకు పైగా చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే ఉన్నత విద్య చదివి డీఎడ్, బీఎడ్, ఎంఎడ్ చేసిన వారు మండల కేంద్రాల్లో పని చేసేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చాలా వరకు ప్రభుత్వ గుర్తింపు పొందేందుకు తమ పాఠశాలల్లో డీఎడ్, బీఎడ్, ఎంఎడ్ చేసిన వారితో విద్యాబోధన చేయిస్తామని పేర్కొంటూ అనుమతులు పొందుతున్నారు. పాఠశాలల ప్రారంభానికి కావాల్సిన నిబంధనలు సరిపోయెలా అప్పటికప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. అనుమతి రాగానే కనీస అర్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. ఉన్నత పాఠశాలల అమనుతి కోసం కనీసం ఏడుగురు డీఎడ్, ప్రాథమికోన్నత పాఠశాలల కోసం కనీసం ఐదుగురు డీఎడ్ చేసిన వారు పని చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు పెంచితే అవసరమైన మేరకు ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారే ఉండాలి.

3242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles