జన్మభూమికి సేవ చేసేందుకే స్వర్ణభారత్ ట్రస్టు: వెంకయ్యనాయుడు

Sun,January 13, 2019 02:38 PM

Swarna Bharat Trust to serve the birthplace says venkaiah naidu

రంగారెడ్డి: జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్టు ప్రారంభించినట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్టులో నేడు ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమ నిర్వహణ వేడుకలు జరిగాయి. ఈ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, దర్శకుడు రాఘవేందరావు, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా అతిథులు గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కూడా స్వర్ణభారత్ లక్ష్యాల్లో ఒకటన్నారు. గంగిరెద్దుల ఆటలో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు. యజమాని ఆదేశం ప్రకారం నడుచుకోవడం అనే విషయం అందులో దాగి ఉందన్నారు. మన ప్రతి పండగ వెనక శాస్త్రీయ సందేశం ఉందన్నారు. ఒకరికి మనమిచ్చే అభినందనలు యువతకు మరింత స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు.

వ్యవసాయంలో గుణాత్మక మార్పు రావాలి..
ఒకప్పుడు మనదేశం స్వర్ణభారతం. మళ్లీ నాటి ఘనత పొందాలనేదే స్వర్ణభారత్ ట్రస్టు ఆశయమని చెప్పారు. షేర్ అండ్ కేర్ అనేది మన సిద్ధాంతం. ఇతరులతో పంచుకోవాలి, ఇతరుల గురించి జాగ్రత్త తీసుకోవాలి. విదేశాలకు వెళ్లినా.. అక్కడ బాగా నేర్చుకుని మళ్లీ మనదేశానికి తిరిగి రావాలని యువతకు చెబుతుంటా. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్టు ప్రారంభించాం. 18 సంవత్సరాలుగా ట్రస్టు తరపున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. నా సంకల్పాన్ని కుమారుడు, కుమార్తె ముందుకు తీసుకెళ్తున్నారు. వ్యవసాయం చేస్తోన్న వారికి ప్రయోజనాలు కల్పించాలి. రైతుల అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. వ్యవసాయంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

1855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles