గతించిపోవద్దు.. గమ్యం చేరాలి..!

Mon,May 13, 2019 08:50 AM

suicide is not the solution for failure

- ఓ విద్యార్థీ ఆత్మహత్యలొద్దు
- పాస్.. ఫెయిల్ కాదు.. జీవితం ముఖ్యం
- ఓటమి గెలుపునకు నాంది కావాలి

జీవితం ఎప్పుడూ.. సవాళ్లను విసురుతూనే ఉంటుంది.. దానిని ఎదుర్కొని నిలిస్తేనే విజయం సొంతమవుతుంది. ఓటమి గెలుపునకు నాంది... ఓడిపోయామని నిరుత్సాహానికి గురికాకుండా మరింత ధైర్యాన్ని గుండెల్లో నింపుకొని ముందుకు సాగాలి. పరీక్ష తప్పినంత మా్రత్రాన.. కోల్పోయేది ఏమీ లేదు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే. మరోసారి ప్రయత్నించాలి. గతించిపోవద్దు..గమ్యం వైపు చేరాదేకా వదలొద్దు.. ఉజ్వల భవిష్యత్‌కు దారులు వేయాలి.

చదువు అనేది ఒక వ్యక్తికి అవసరం. తన జీవితంలో చదువు అనేది కీలకపాత్ర పోషిస్తుంది. చదువే జీవితం కాదు. కానీ నేటి పరిస్థితులు చూస్తే చదువు లేకుండా బయట ప్రపంచంలో బతకలేమో అన్నంతగా పరిస్థితులు తయారయ్యాయి. విద్యార్థులపై పోటీని సాకుగా చూపి వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీంతో పరీక్షలో ఫెయిలైతే అదేదో జీవితంలోనే ఫెయిల్ అయినట్లు భావించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ చదువు లేకుండా జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను సాధించినవారు కోకొల్లలు. పరీక్ష తప్పితే.. మరోసారి రాసుకునే అవకాశం ఉంటుంది. కానీ జీవితంలో తప్పితే.. మరో అవకాశం ఉండదనే విషయా న్ని ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి మానసిక భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. ఫలితాల్లో తప్పినా.. తక్కువ గ్రేడ్ వచ్చినా.. ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మరోసారి సన్నద్ధమయ్యి.. అత్యుత్తమ గ్రేడ్‌ను సాధించొచ్చు.

మనోధైర్యం నింపాలి..


మనస్తాపం చెందిన వారిలో మనోధైర్యం నింపాలి. చావే సమస్యకు పరిష్కారం కాదని వివరించాలి. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచించాలి. పరాజయం విజయానికి నాంది అని తెలియజెప్పాలి. జీవిత మాధుర్యాన్ని పిల్లలకు చెప్పాలి. ఏదైనా జీవించి సాధించాలని, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని సూచించాలి. ఫలితాల సమయంలో ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని ధైర్యాన్ని నూరిపోయాలి. తల్లిదండ్రులు పిల్లలకు మానసిక దైర్యం చెప్పకపోతే.. భవిష్యత్‌లో ఎదురయ్యే మరిన్ని కఠిన పరీక్షలను ఎదుర్కొలేరు. ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో సామర్థ్యం ఉంటుంది. అంతకుమించి వారి నుంచి ఆశిస్తే ఒత్తిడికి గురవుతారు. అలాంటి వారిని ప్రోత్సహించే విధానాలు తెలుసుకొని వారిని మానసికంగా బలవంతులను చేయాలి. లేకుంటే ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినా.. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొలేరు. అందుకే సమస్యలను తట్టుకునేలా విద్య ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

అధైర్యపడొద్దు..


పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోలేదన్న సంగతిని ప్రతి ఒక్కరూ విద్యార్థులకు గుర్తు చేయాలి. ఫలితాల అనంతరం ఉత్తీర్ణులైన వారికి ఏయే అవకాశాలున్నాయో తెలియజేయడంతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆత్మవిశ్వాసం నింపాలి. పరీక్షల్లో తిరిగి ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ బోధన అందేలా చూడాలి. విద్యార్థులు అధైర్యపడకుండా అండగా ఉన్నామనే విషయాన్ని వివరించాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి అత్యధిక అంచనాలను కలిగి ఉండొద్దని, పిల్లల వాస్తవిక స్థాయిని గుర్తించాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల గురించి తల్లిదండ్రులు తమ కోరికలు, ఆశలకు అనుగుణంగా బలవంతంగా పిల్లలకు ఇష్టంలేని కోర్సుల్లో చేర్పించొద్దు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, సైన్స్ కోర్సుల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అందుకోసం కష్టపడి వారు సాధించిన సొమ్మును వెచ్చిస్తున్నారు. కానీ వాస్తవానికి తమ పిల్లలకు ఆ స్థాయిలో చదివే సామర్థ్యం ఉందో లేదో గుర్తించాల్సిన అవసరం ఉంది.

విజయానికి తొలిమెట్టు..


ఓటమి విజయానికి తొలిమెట్టు వంటిదని, అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నది విద్యావేత్తలు చెబుతున్నారు. ఎందుకు ఓడిపోయాం? కారణమేమై ఉంటుంది? మరోసారి అలాంటి తప్పులు చేయను.. అనే విధంగా దానిని సరిదిద్దు కునేందుకు మళ్లీ ప్రయత్నిస్తే, విజయం తప్పక వరిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఓటమి విజయానికి బాటలు వేస్తుందన్న నిత్య సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచిస్తున్నారు. కష్టపడి చదవాలి. మంచిమార్కులు సాధించాలన్న లక్ష్యంతో దూసుకుపోవాలి.

తల్లిదండ్రులూ ఇవి గుర్తుంచుకోండి..- తమ పిల్లలు అనుకున్న మార్కులు సాధించలేదనో, పాస్ కాలేదనో వారిని మందలించవద్దు.
- ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పోల్చుతూ హేళనగా మాట్లాడకూడదు.
- ఫలితాల సమయంలో పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
- ఫలితాలు అనుకూలంగా వస్తే ఫరవాలేదు. ప్రతికూలంగా వస్తే.. వారు తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అటువంటి సమయంలో వారిని అక్కున చేర్చుకోవాలి.
- జరిగిన పొరపాటు గురించి పిల్లలతో సున్నితంగా చర్చించి, మేమున్నామన్న భరోసాను ఇవ్వగలిగితే వారికిక తిరుగేలేదు.

విద్యార్థులకు సూచనలు...


- పాస్, ఫెయిల్ అన్నవి అత్యంత సాధారణ విషయాలుగా భావించాలి.
- జీవితం ఎంతో విలువైనది. భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధించవచ్చన్న సానుకూల దృక్పథంతో ఆలోచించాలి.
- ఫలితాలతోనే జీవితం ముడిపడి ఉందని భావించకూడదు.
- అనుకూల ఫలితాలైతే ఫర్వాలేదు. అదే ప్రతికూలమైతే సానుకూలంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి.
- వ్యతిరేక ఫలితం ఎదురైతే కాసేపు ప్రశాంతంగా ఆలోచించాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు మరోసారి పునశ్చరణ చేసుకోవాలి.
- మన ప్రయత్న లోపం లేనప్పుడు జరిగిన పొరపాటుకు కారణాలను విశ్లేషించుకోవాలి.
- జరిగిన పొరపాటుకు కుంగిపోకుండా మనసులో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి.
- ఒత్తిడి నుంచి వేగంగా బయటపడే ప్రయత్నం చేయాలి.
- తల్లిదండ్రులతో చర్చించి వారి నైతిక మద్దతు పొందాలి.
- జరిగిన తప్పును వీలైనంత వరకు తల్లిదండ్రులకు చెప్పుకుంటే 90 శాతం భారం దిగిపోయినట్లేనని గ్రహించాలి.
- విజయం మనదేనని నిర్ణయించుకొని, పట్టుదలతో చదువుతూ పూర్తిస్థాయిలో ఏకగ్రత పెంచుకోవాలి.
- వెనుకబడిన సబ్జెక్టులు లేదా పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి.. అవసరమైతే అధ్యాపకులు, సీనియర్ల సూచనలు, సలహాలను తీసుకోవాలి.
- తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంత క్షోభకు గురవుతారోనని ఒక్క క్షణం ఆలోచించాలి.

2044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles