బడికి వెళ్లలేక కిడ్నాప్ కథను అల్లిన విద్యార్థులు

Thu,August 30, 2018 08:49 PM

students stories kidnapping

వేములవాడ : బడికి వెళ్లలేక కిడ్నాప్ కథను రూపొందించుకొని సోదరునికి వివరించి సినిమా తరహాలో ఆడిన హైడ్రామాను వేములవాడ పట్టణ సీఐ వెంకటస్వామి చాకచక్యంగా గంటన్నరలోపే ఛేదించారు. ఇక కాసేపు ఉత్కంఠ నెలకొన్న పోలీసులు వేర్వేరు కోణాల్లో విచారించగా సీసీపుటేజీల సహాయంతో సంఘటన తేల్చడంతో బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన కోరుకొండ సుమన్ శోభారాణి దంపతులు ఐదు మాసాలుగా వేములవాడలోనే అద్దె గదులను నింపుతూ ఓ దుకాణాన్ని నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.

వారి కుమారుడు వరుణ్‌ను వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే 7వతరగతిలో చేర్పించగా సుశాంత్ ఉప్పుగడ్డ వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. తమ్ముడు సుశాంత్‌ను పాఠశాలలో వదిలి చూసి వస్తానని వరుణ్ జాతరగ్రౌండ్‌లోని వారి నివాసం నుంచి బయలుదేరి వెళ్లాడు. కాసేపటి తర్వాత సుశాంత్ అన్నయ్య వరుణ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేశారంటూ వచ్చి తల్లి శోభారాణికి చెప్పాడు.

దీంతో హుటహుటిన వారు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని సీఐ వెంకటస్వామికి ఫిర్యాదు చేశారు. ఆటోలోనే ముఖానికి గుడ్డకట్టుకున్న వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేశారంటూ సుశాంత్ సీఐకి వివరించగా తల్లి, కొడుకులను వేర్వేరుగా సీఐ విచారించారు. దీంతో పాటు పట్టణంలోని సీసీ కెమెరాలను వారు వెల్లడించిన వివరాల ప్రకారం పరిశీలించగా సదరు వరుణ్ తిప్పాపూర్ బస్టాండ్‌లో బస్ ఎక్కేందుకు పరిగెడుతున్నట్లు దృశ్యాలను గమనించారు. ఆ తరువాత వేర్వేరుగా విచారించిన సీఐ అన్న వరుణ్ ఇలా చెప్పామన్నాడంటూ సుశాంత్ పోలీసులకు తేల్చి చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సీసీ పుటేజీల ఆధారంగా సదరు వరుణ్ వరంగల్ బస్‌లో బయలుదేరినట్లుగా గమనించి బస్‌నంబర్ ఆధారంగా హుజురాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి పోలీసులు సదరు వరుణ్‌ను ఆధీనంలోకి తీసుకోగా వేములవాడ నుంచి వెళ్లిన పోలీసు బృందం వరుణ్‌ను వేములవాడకు చేర్చారు. సదరు వరుణ్‌ను శోభారాణి సుమంత్ దంపతులకు పట్టణ సీఐ వెంకటస్వామి అప్పగించారు.

చదువుపై ఇష్టం లేకే...

శోభారాణి తల్లిదండ్రులు ఐదేళ్లుగా వేములవాడలోనే అద్దెగదులు నింపుతూ జీవనోపాధి పొందుతున్నారు. ఇటీవలే ఐదునెలల క్రితం శోభారాణి అత్తవారి ఇంటి నుంచి వేములవాడకు వచ్చి ఇక్కడే ఉపాధి పొందుతుంది. అయితే సుమన్ కూడా వేములవాడకు రావాలని కోరుతుండగా ఇరువురి మధ్య కొంత చిరుకలహాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రాఖీ పండుగకు వేములవాడకు వచ్చిన తరుణంలోనే సదరు వరుణ్ మేనమామతో కలిసి అలంకానిపేట్‌కు వెళ్తానని మారాం చేసినట్లుగా తెలుస్తుంది. చదువు పై శ్రద్ధలేని సదరు వరుణ్ తమ్ముడితో కలిసి కిడ్నాప్ డ్రామాను ఆడినట్లుగా తెలుస్తుంది.

4433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles