నాటకంగా ముంబై వ్యభిచార బాధితుల గాథలు

Fri,January 19, 2018 11:05 AM

హైదరాబాద్ :ఎవరూ అటువైపు అడుగు వేయడానికి ఇష్టపడరు. ఆ బురదలోనే అందమైన తామరలు వికసిస్తాయి. దుర్భరమైన పేదరికం, రోగగ్రస్థమైన జీవితాలూ ఆ బురదలాంటివే. ముంబాయి మహానగరంలో వ్యభిచార వృత్తికి ప్రసిద్ధిగాంచిన కామాటిపుర కన్నీటి కథల్లోని విజయ గాథ ఇది. అమ్మ ఉండి నాన్నలేని వాళ్లు, అమ్మానాన్నా లేనివాళ్లు ఆ వ్యభిచార కూపాన్ని కాదనుకుని పోరాడి గెలిచారు. అందమైన దేహం కోసం ఆశపడే వాళ్లే తప్ప అందమైన ఆలోచనకు ఆలంబనగా నిలిచే వాళ్లు లేని ఈ సమాజంలో వాళ్ల గెలుపు రికార్డులు కొలువలేని విజయం. అవార్డులు అందని కీర్తి. ముంబయి నగరంలో బయలుదేరిన రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ నగరానికి వస్తున్నది. ఆదివారం నాటక ప్రదర్శనతో వ్యభిచార కూపంలోని కన్నీటి గాథలు కళ్లకుకట్టేందుకొస్తున్నది.


రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ ఆసక్తికరమైన నాటకం. వ్యభిచార కుటుంబాల కన్నీటి గాథలెన్నో ఉన్న నాటక మిది. ఈ నాటకం ఇప్పటికే ఇంగ్లండ్, అమెరికా దేశాల్లో ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలమందికిపైగా నాటకాభిమానులు వీక్షించిన ఈ నాటక మిది. ప్రపంచంలోనే అతిపెద్ద నాటకోత్సవం అయిన ఎడిన్‌బర్గ్ ఫ్రింజ్ ఫెస్టివల్‌లో దీనిని ప్రదర్శించారు. ఆర్ట్‌లైఫ్ సంస్థ ఈ నాటకాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తున్నది. అమెరికాలో సామాజిక సేవా కార్యక్రమాలకు అందించే అవార్డులను ఈ నాటక కళాకారులు గెలుచుకున్నారు. ఆర్ట్‌లైఫ్ ఈవెంట్స్ నిర్వాహకులు తరుషా సక్సేనా, ప్రశాంత్ శర్మ ఈ నాటకాన్ని ప్రత్యేకమైన చొరవచూపి నగరంలో ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

వ్యభిచార వృత్తిలో ఉండే స్త్రీల కష్టాలు, వాళ్ల ఆర్థిక ఇబ్బందులు, సమాజంలో వాళ్లపట్ల ఉండే చిన్నచూపు, తిరస్కారం, ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఈ నాటకంలో ఉంటాయి. పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకులు వ్యభిచారులను ఎలా హింసిస్తారో, డబ్బు కోసం పీడిస్తారో ఈ నాటకం వివరిస్తుంది. ప్రపంచ విమర్శకులు ప్రశంసలందుకున్న ఈ నాటకంలో మొత్తం 14 మంది యువ కళాకారులు ప్రదర్శిస్తారు. వారంతా వ్యభిచార బాధితుల పిల్లలే. వీళ్లంతా ముంబయిలో ప్రాచుర్యం పొందిన రెడ్‌లైట్ ఏరియా, కామాటిపురా ప్రాంతానికి చెందినవాళ్లు. వ్యభిచార వృత్తిలోకి నెట్టబడ్టవాళ్లు, మహిళల అక్రమ రవాణా బాధితులు. తమ జీవితాల ఆధారంగా తాము అల్లుకున్న కథను వాళ్లు అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఒక నటి, నటుడు ఒకే పాత్ర కాకుండా ప్రతి ప్రదర్శనలో మరో పాత్రలో నటించడం ఈ రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ప్రదర్శించే ఈ నాటకాన్ని తప్పక చూడండి. వాళ్ల కష్టాలను విని, పరిష్కారం చూపండి.

పోరాటానికి స్ఫూర్తి
పుట్టుకను ఎవరూ ఎంపిక చేసుకోలేరు. కొందరు ఐశ్వర్యం, అంతస్థు ఉన్న ఇళ్లలో పుడతారు. కానీ కొందరు ఏ తప్పూ చేయకుండానే దుర్బరమైన జీవితాన్ని అనుభిస్తుంటారు. ఆ బాధలకు కారణం వారి పుట్టకే. అలాంటి వాళ్లలో వ్యభిచార వృత్తిలో వున్న బలహీనులైన స్త్రీల పిల్లలు కూడా కొందరు. దుర్భరమైన ఆ జీవితాన్ని కాదనుకుని వాళ్లు అద్భుతమైన జీవితాన్ని కలగంటున్నారు. సిల్వర్ స్పూన్‌తో పుట్టి పెరిగినవాళ్లు, అన్ని వసతులున్నా రాణించలేని ఈ సమాజంలో వీళ్లు కష్టపడి సమాజంలో రాణిస్తున్నారు. సమాజ ఆదరణలేకున్నా స్వయం కృషితో ఎదిగిన వీళ్లను మనం గుర్తించాలి. గౌరవించాలి. వాళ్లు చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట కనీస మర్యాదలే కాదు, ఆత్మీయమైన ఆదరణ ఇవ్వడం సాటి మనిషిగా మన బాధ్యత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బాధితుల పక్షాన నిలుస్తుంది. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేందుకు సాయమందిస్తుంది. దురావస్థలోఉన్న వీరంతా విజయం సాధిస్తే ఒక వ్యభిచార వ్యవస్థను రూపుమాపినవాళ్లమవుతాం. - బుర్రా వెంకటేశం, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి

ఇది కళకు దక్కిన గౌరవం
ప్రపంచ దేశాలను మెప్పించిన ప్రదర్శన రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్. ప్రపంచంలోనే అతిపెద్దదైన నాటక వేదికగా వున్న ఎడిన్‌బర్గ్ థియేటర్‌లో ఈ నాటకాన్ని ప్రదర్శించడం గొప్ప గౌరవం. ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శన కోసం సహకరించేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. ఇది కళకు, బాధితుల విజయాలకు దక్కిన గౌరవం. - ప్రశాంత్

2659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles