12వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం

Sat,August 11, 2018 04:22 PM

sravana masam satrt from august 12

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో ప్రతి నెలకు ఒక విశిష్టత ఉందని చెప్పవచ్చు. అన్ని మాసాలకంటే శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసం వస్తూ వస్తూనే పండుగలను తీసుకొని వస్తుంది. పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గర ఉంటాడో ఆ నెలకు ఆ నక్షత్రం పేరు వస్తుంది. శ్రావణ నక్షత్రం దగ్గరకు చంద్రుడు ఉన్నప్పుడు ఆ పౌర్ణమికి ముందు పదిహేను రోజులు, తర్వాత పదిహేను రోజులను శ్రావణ మాసంగా చెప్పవచ్చు. నాలుగు సోమ, నాలుగు మంగళ, నాలుగు శుక్ర, నాలుగు శనివారాల చొప్పున 16 రోజులలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. విష్ణుమూర్తి జన్మనక్షత్రమైన శ్రవణ పేరుతో ప్రారంభమైన ఈ మాసంలో ప్రతి మంగళ, శుక్రవారాలు మహిళలు ఎంతో శుభప్రదంగా బావిస్తారు. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, గౌరిదేవికి, శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజులు. ఇక ఈ నెలలోనే వచ్చే మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలు ఎంతో సౌభాగ్యకరమైనవి వీటి గురించి వేరే చెప్పనక్కర్లేదు. నాగుల పంచమి, రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీ కృష్ణాష్టమి, పొలాల అమావాస్య లాంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే రావడంతో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత చేకూరింది. చుక్కల అమావాస్యతో మొదలై పొలాల అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఈ మాసాంతం హిందువులు ప్రత్యేక దీక్షలతో దేవతల అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆలయం ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో అలరారుతుంది.

శ్రావణం మాసం విశిష్టత..
శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావ ణం. శ్రీనివాసుని జన్మ నక్షత్రం కూడా శ్రావణమే.. శ్రీ కృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే.. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం.. భక్తి మార్గాల్లో శ్రవణభక్తి మొదటిది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి. అం దుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకుంది.

ప్రతి రోజూ ప్రత్యేకమే..
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ మాసాంతం శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెప్తున్నారు. ఈ మాసాంతం స్వామిని, అమ్మవారిని కొలిస్తే సకల పాపాలు తొలు గుతాయని పండితులు చెబుతున్నారు.

సోమవారం..
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ముక్తి ప్రదాత ముక్కంటికి సోమవారం ఎం తో ప్రీతికరమైనది. ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన ఆ దేవదేవుని అభిషేకాలతో, అర్చనలతో నమస్కరిస్తే శుభాలు కలిగి సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.

మంగళవారం..
అభయమిచ్చే హనుమంతుడు.. సకల విఘ్నాలను తొలగించి సకల దేవతల కంటే ముందే మొదటి పూజలందుకునే విఘ్నేశ్వరుడు.. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మేశ్వరుడు మంగళవారం నాడే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవా రం ఆయా దేవతలందరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలు కలుగుతాయని నమ్మకం.

శుక్రవారం..
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. ఈ రోజున అమ్మవారి కురుణా కటాక్షాలు లభిస్తాయంటారు. వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి శుక్రవారం ఎంతో శుభప్రదమైంది. ఈ రోజున అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లెల మా లను సమర్పిస్తే సకల పాపాలు తొలుగుతాయన్న భక్తుల నమ్మ కం. రుణ విముక్తి, లక్ష్మీకటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మ కం. అదే విషయాన్ని పండితులు కూడా చెబుతున్నారు.

శనివారం..
కలియుగ దైవం శ్రీనివాసుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం. ఈ రోజున ఉపవాస దీక్షలు చేపడతారు. స్వామివారికి పుష్పార్చనలు చేస్తారు. తులసీ దళాల మాలలు సమర్పిస్తారు. ఇలా ప్రతి శనివారం చేస్తే కోరిన కోరికలు తీరి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం.

బుధ, గురువారాలు..
బుధ, గురు వారాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. బుధవారం అయ్యప్పకు ప్రీతికరమైందిగా, గురువారం రాఘవేంద్రస్వామి, దక్షిణమూర్తి, సాయిబాబలకు ప్రీతికరమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ రోజున ఆయా దేవతలను, గురువులను కొలిచిన, దర్శించుకున్న సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం.

శ్రావణ మాసంలో వచ్చే పండుగలు..
శ్రావణ మాసం వర్ష రుతువుతో పాటు పండుగలను తీసుకొస్తుంది. ఈ మాసంలో వచ్చినన్ని పండుగలు ఏ మాసంలో మనకు కనిపించవు. అందుకే ఈ మాసాన్ని పండుగల మాసం అని అంటారు. శ్రావణ మాసంలో మొదట వచ్చే పండుగ మంగళగౌరి వ్రతం, ఆ తరువాత నాగుల చవితి, శ్రీవరలక్ష్మి వ్రతం, శ్రావణ పూర్ణిమ, శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, శ్రీ కృష్ణాష్టమి పండుగలన్ని ఈ మాసంలోనే వస్తాయి.

మంగళగౌరి వ్రతం..
శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లోను, శుక్రవారాల్లోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులు, అవివాహిత స్త్రీలు ఆచరించే మంగళగౌరి వ్రతం అత్యంత విశేషమైంది. అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తోరశత నామాలతో పూజిస్తారు. పసుపుతో, బంగారంతో, వెండి తో గౌరమ్మను పూజిస్తే సుఖ సంపదలు, ధనదాన్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. వివాహం కాని వారికి వివాహం అవుతుందన్నది ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.

నాగుల పంచమి..
శ్రావణ శుద్ధ, చవితి, పంచమి రోజున నాగుల, చవితి, పంచమిలను జరుపుకుంటారు. ఈ రెండు రోజులతో పాటు, శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో పెద్దలు, పిల్లలు పుట్టల్లో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్వదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

వరలక్ష్మి వ్రతం..
నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో శ్రీవరలక్ష్మి వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ప్రత్కేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు.

శ్రావణ పూర్ణిమ...
శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్, జంద్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. అనుబంధానికి ప్రతీకగా రక్షా బంధన్‌ను జరుపుకుంటారు.

శ్రీ కృష్ణాష్టమి..
శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీ కృష్టుడి జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ప్రతి పల్లె, పట్టణం ఉట్టి సంబరాలు జరుపుకుంటాయి. చిన్నారులను గోపికలుగా, కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు.

శుభ ముహూర్తాలు..
శ్రావణ మాసం వివాహాలకు, శుభకార్యాలకు అనుకూలమైన మాసం. ఈ మాసంలో 13 నుంచి 16, 17,19, 23, 24, 25, 29, 30 దాకా మంచి దివ్యమైన ముహూర్తాలు ఉన్నట్లుగా పండితులు వెల్లడించారు.

ఆలయాల్లో శ్రావణ శోభ..
శ్రావణమాసంలో ఆలయాలన్ని నూతన శోభను సంతరించుకోనున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆలయలతో పాటు వివిధ మండలాలలోని ప్రధాన ఆలయాలన్నింటిని శోభాయమానంగా తీర్చిదిద్ధనున్నారు. నిత్యాభిషేకాలతో, నిత్యపూజలతో ఆలయాలు అలరాలనున్నాయి. కోటలోని శ్రీలక్ష్మీ భూచెన్నకేశవస్వామి ఆలయం, శ్రీ మార్కండేయ, శ్రీ కన్యకాపరమేశ్వరి, శ్రీ అంబాభవానీ, శ్రీభద్రకాళి అమ్మవారి, శ్రీ అన్నపూర్ణేశ్వరి, శ్రీపాండురంగస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి, నది అగ్రహారం స్పటికలిగేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీనృసింహస్వామి, ఉత్తర ముఖ ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు, అన్ని శివాలయాల్లో పత్యేక పూజలు నిర్వహిస్తారు. నేటి అమావాస్యను పురస్కరించుకుని చాలా మంది భక్తులు శ్రావణ మాస పూజలను ప్రారంభించనున్నారు.

7455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles