అమ్మలేని లోకంలో ఉండలేనని..

Sun,January 6, 2019 12:27 PM

అమ్మను మించి దైవం లేదనుకున్నాడు. పదేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైనా కళ్ల ముందుంటే చాలని పెళ్లిని సైతం వాయిదా వేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో అమ్మ లేని లోకంలో తాను ఉండలేనని రైలు బండికి ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు ప్రకాశ్. కొడుకు మరణవార్త తెలిసిన తల్లిసైతం గుండెపగిలి తుది శ్వాస విడిచింది. నల్లగొండ మండలం అప్పాజీపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.


నల్లగొండ : తల్లి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైనా ఆమె తన కళ్లముందు ఉంటే చాలనుకున్నాడు ఆ కొడుకు. పదేళ్లుగా కూలి చేస్తూ తల్లిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఇటీవల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం బతికించుకునేందుకు దవాఖానల చుట్టూ తిరిగాడు. చివరకు తల్లి బతకదని డాక్టర్లు తేల్చడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిలేని లోకంలో తా నూ ఉండలేనంటూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతిని తట్టుకోలేని గంటల వ్యవధిలోనే తల్లి సైతం కన్ను మూసింది. ఈ హృదయ విధారక ఘటన నల్లగొండ మండల పరిధిలోని అప్పాజీపేట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అప్పాజీపేట గ్రామానికి చెందిన మర్రి భానుమతి (65)(దివ్యాంగురాలు)కి కుమారుడు, కుమార్తె. భర్త చంద్రయ్య 20ఏళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె కూలి చేసి పిల్లలిద్దరినీ పెంచింది. పదేళ్లక్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో కాళ్లు చేతులు చచ్చుపడిపోయి మంచానికే పరిమితమైంది. దీంతో కుమారుడు ప్రకా శ్(32) కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నా డు. మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే.. అక్క పెళ్లి చేశాడు.

తల్లిని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని దవాఖానల చుట్టూ తిరిగినా.. నయం కాకపోవడంతో అప్పటి నుంచి తల్లికి సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. తాను పెళ్లి చేసుకుంటే తల్లిని చూసుకోవడం సాధ్యం కాదేమోనన్న భయంతో పెళ్లికూడా వాయిదా వేస్తూ వడు. 15 రోజుల క్రితం భానుమతి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని వివిధ దవాఖానల్లో వైద్యం చేయించాడు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడక పోగా.. ఇక ఆమె బతకదని.. ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో గురువారం రాత్రి ఇంటికి తీసుకొచ్చాడు. తన తల్లి ఎక్కువరోజులు బతకదని.. తల్లిలేకుండా తాను ఎలా బతకాలంటూ ఇంటికి వచ్చిన బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేయగా వారు అతడికి ధైర్యం చెప్పారు. తనకు తండ్రి లేడు.. ఇక తల్లి కూడా లేకుండా పోతే తానెలా బతకాలంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ప్రకాశ్ తనకు ఒకరు డబ్బులివ్వాలని, వాటిని తీసుకొస్తానని తన అక్కకు చెప్పి తెల్లవారు జామున ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అక్కడి నుంచి నార్కట్‌పల్లి మండలం శేరుబావి గూడానికి వెళ్లిన అతను రైలుకిందపడి ఆత్మహత్య చేసు కున్నాడు.

కొడుకు మరణవార్త విని తల్లి మృతి..


రైలు కింద పడి మృతి చెందిన వ్యక్తి జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి భానుమతి రోదిస్తూ సొమ్మసిల్లింది. దీంతో బంధువులు ఆమెను వెంటనే స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొద్ది గంటల సమయంలోనే ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి మృతదేహాలను సందర్శించారు.

2693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles