రైళ్లలో స్మార్ట్ కోచ్‌లు

Tue,February 12, 2019 09:22 AM

హైదరాబాద్: రైల్వేలో స్మార్ట్ కోచ్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఆ శాఖ సిద్ధమవుతున్నది. ప్రమాదాలు జరిగితే విశ్లేషించేందుకు విమానాల తరహాలో వీటిల్లో కూడా బ్లాక్‌బాక్స్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. విమానాలు, హెలికాప్టర్లల్లో ఉపయోగించే బాక్ల్‌బాక్స్‌లను రైల్వేలోకి మొదటిసారిగా తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టు కింద ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఇటీవల ప్రారంభించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కోచ్ కండిషన్, ప్రయాణికులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక్కడి ఫలితాలను బట్టి రానున్న రోజుల్లో వీటిని దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు విస్తరించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. బ్లాక్‌బాక్స్‌లతో ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకొని, విశ్లేషించండం ద్వారా భవిష్యత్‌లో అలాంటి ప్రమాదాలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణిస్తున్నప్పుడు మార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే బ్లాక్‌బాక్స్‌లో ఆ సమాచారం నిక్షిప్తమవుతుంది. తద్వారా వాటిని విశ్లేషించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రమాదాలను నివారించడంతోపాటు దోపిడీ దొంగతనాలకు సైతం చెక్ పెట్టవచ్చని అధికారులు చెప్తున్నారు.
ముందుగానే సమస్యల గుర్తింపు..
బ్లాక్‌బాక్స్‌ల ఏర్పాటు వల్ల ప్రమాదాలకు గల కారణాలు, రైలు పట్టాలు తప్పడం, రైలు ఆలస్యానికి కారణాలు, మౌలిక సదుపాయాల్లో ఉండే సమస్యలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కోచ్‌లలో వచ్చే సమస్యలను కూడా ముందుగానే గుర్తించడానికి సెన్సార్ బేస్డ్ ఆన్‌బోర్డు మానిటరింగ్ సిస్టంను ఏర్పా టుచేస్తున్నారు. దీనిద్వారా కోచ్‌లో వెంటిలేషన్, ఏసీ, నీటి లభ్యత, ఉష్ణోగ్రత స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ప్రధానంగా ప్రయాణికుల భద్రతను పరిశీలించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి స్మార్ట్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తే ప్రయాణికులకు భద్రతాపరంగా మేలు కలుగుతుందని రైల్వేశాఖ అధికారులు భావిస్తున్నారు.

907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles