ఈ నెల 25న స్కిన్ సఫరత్ రథయాత్ర

Thu,January 24, 2019 06:04 AM

గాంధీ దవాఖాన : చర్మ సౌందర్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతను ఇస్తారని అలాంటి చర్మాన్ని రక్షించుకునేందుకు తగిన సలహాలు, సూచనలు చర్మ వైద్యుల వద్ద పొందాలని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ అన్నారు. గాంధీ దవాఖాన డెర్మటాలజీ విభాగంలో జరిగిన చర్మవ్యాధుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చర్మవ్యాధులు కలిగిన వ్యక్తులను సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. అలాగే ప్రజల్లో ఉన్న అనుమానాలను రూపుమాపేందుకు సొరియాసిస్, తెల్లమచ్చలు ఇలా ఎలాంటి వ్యాధులకైనా చికిత్స ఉంటుందని, ఆ జబ్బులు కలిగిన ప్రజలు వైద్యులను సంప్రదించేందుకు మొహమాటపడటం మంచిది కాదన్నారు. చర్మవ్యాధులు కలిగిన వ్యక్తులు నేరుగా చర్మవ్యాధి వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందితే ఎలాంటి ఇబ్బందులుండవని తెలిపారు.


అనంతరం ఈ నెల 25వ తేదీన స్కిన్ సఫరత్ రథయాత్ర ఢిల్లీ నుండి బయలు దేరి గాంధీ దవాఖానకు వస్తుందని అన్నారు. ఈ రథయాత్ర 18 రాష్ట్రాలను కలియతిరుగుతూ 60 రోజుల పాటు 12వేల కిలోమీటర్ల పొడవునా పలు ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందన్నారు. ఈ రథయాత్రలో చర్మవ్యాధులపై అవగాహన కలిగించే చిత్రాలతో పాటు చర్మవ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో ఉండే స్క్రీన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో డీవీయల్ విభాగం హెచ్‌ఓడీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహరావు నేత, డాక్టర్స్ భూమేశ్‌కుమార్, రామ్మోహన్, కవిత, పద్మ, నాగశ్వేత, షాహానా, రాకేశ్, సంగీత తదితరులు పాల్గొన్నారు.

700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles