
హైదరాబాద్ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన రాష్ట్రస్థాయి అటవీ రక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, పీసీసీఎఫ్ పీకే ఝా, విద్యుత్, అటవీ, ఆర్థిక, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పులుల రక్షణకు ప్రత్యేక పరిరక్షణ దళం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో పులులు, వన్యప్రాణుల రక్షణ ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పులులు, వన్యప్రాణుల రక్షణకు 112 మంది సిబ్బందితో ప్రత్యేక సాయుధ దళం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు చోట్లా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో ప్రత్యేక సాయుధ దళం పని చేయనుంది. ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్ వాచర్లతో సాయధ దళం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. సాయుధ దళం నిర్వహణకు 60, 40 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం భరించనున్నాయి. అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ చర్యలకు రూ. 2.20 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ఆయా శాఖల సమన్వయంతో అడవుల రక్షణకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అడవుల రక్షణకు సమీకృత ప్రణాళిక సిద్ధం చేసి, అమలు చేయాలని, అడవుల్లో చెట్ల నరికివేత, వేటను పూర్తిగా అరికట్టడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అటవీ నేరాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదుకు కమిటీ అనుమతించింది. జంతువుల వేటకు విద్యుత్ వాడితే విద్యుత్ చౌర్యం, అక్రమ వినియోగం కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అటవీ ప్రాంతాల్లో పని చేసే విద్యుత్ ఉద్యోగులు సంబంధిత విషయాలపై నిఘా పెట్టాలని సూచించారు. అటవీ నేరాల్లో విచారణ వేగం చేసి నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడాలని నిర్ణయించారు. టాస్క్ఫోర్స్ దాడులు, అటవీ భూఆక్రమణల తొలగింపునకు పోలీసుల సహకారం తీసుకోవాలని, అటవీశాఖ కోరిన చోట పోలీసులతో ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అడవుల పరిరక్షణపై కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ప్రత్యేక అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు.