రాటుదేలిన నాయకుడు.. నిరంజన్ రెడ్డి

Tue,February 19, 2019 12:23 PM

Singireddy Niranjan reddy take Oath as Minister

పూర్తి పేరు : సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
పుట్టిన తేదీ : 1958 అక్టోబర్‌ 04
తల్లిదండ్రులు : తారకమ్మ, రాంరెడ్డి
భార్య : వాసంతి
కుమార్తెలు : ప్రత్యూష, అమృత వర్షిణి, తేజస్విని
స్వస్థలం : పాన్‌గల్‌
విద్యార్హత : బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ(క్రిమినల్‌ లాయర్‌గా కొన్నాళ్లు పని చేశారు)
చేపట్టిన శాఖ: వ్యవసాయశాఖ


హైదరాబాద్ : వనపర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోను సీఎం కేసీఆర్‌ నిరంజన్‌ రెడ్డిని గెలిపించుకుంటే గొప్ప హోదాలో ఉంటారని కూడా బహిరంగ సభలో ప్రకటించారు. సీఎం చెప్పినట్లుగా నిరంజన్‌రెడ్డిని భారీమెజారిటీతో గెలుపించుకోవడం.. నేడు మంత్రిగా కేబినెట్‌లోకి తీసుకోవడంతో సీఎం కేసీఆర్‌ మాటను అక్షరాల నిలబెట్టుకున్నట్లయింది.

ఉద్యమ కాలం నుంచి..
రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టీఆర్‌ఎస్‌లో నిరంజన్‌ రెడ్డి ముఖ్య భూమిక పోషించారు. పార్టీ ముఖ్యుల్లో ఉన్న పది మందిలోను ప్రత్యేకంగా నిలిచిన నిరంజన్‌ రెడ్డి కేసీఆర్‌తో ముందు నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్నారనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం అనేక అటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలోను నిబ్బరంగా ఉద్యమనేతకు అండగా నిలబడ్డ వారిలో ముఖ్యుడుగా నిరంజన్‌ రెడ్డి. ఉమ్మడి జిల్లా సమైక్యపాలనలో ఎంతగా నష్ట పోయిందో కూడా ప్రజలకు వివరించడంలో తనదైన పాత్ర పోషించారు. అన్ని వనరులున్నా ఎక్కువగా నష్ట పోయిన ఉమ్మడి పాలమూరు బతుకుచిత్రాన్ని తెలంగాణ ఉద్యమంలో బట్టబయలు చేసిన నాయకుడిగా నిరంజన్‌ రెడ్డి గుర్తింపు పొందారు. జిల్లా భౌగోళిక పరిస్థితులన్ని ఒంటబట్టించుకున్న నేతగా సమైక్యపాలనలో ఇక్కడి ప్రజలు ఎంతగా నష్టపోయారో ఎప్పటికప్పుడు ఉద్యమనేతకు అందిస్తూ ఒడిదుడుకులను అధిగమిస్తూ నాటి ఉద్యమంలో అదరకుండా.. బెదరకుండా వేసిన ముందడుగులు నేడు ప్రభుత్వంలో సరికొత్త బాధ్యతకు వేదికలుగా నిలిచాయి.

ఉమ్మడి జిల్లాలో తొలి జెండా పట్టి..
దాదాపు దశాబ్దకాలం పాటు ఒంటిచేత్తో టీఆర్‌ఎస్‌ను నడిపించారు. 2009లో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో వనపర్తి ఎమ్మెల్యేగా వచ్చిన టికెట్‌ను వదులుకుని కేసీఆర్‌ గెలుపు బాధ్యతలను నిరంజన్‌రెడ్డి తీసుకున్నారు. ఈ నిర్ణయంతో కేసీఆర్‌ ఎంపీగా గెలవడం ద్వారా నాటి తెలంగాణ ఉద్యమం నిలబడటానికి దోహదపడింది. అదే తరుణంలో టీఆర్‌ఎస్‌కు పది ఎమ్మెల్యే స్థానాలుంటే సమైక్య వాదుల కుట్రల ఎదురుదెబ్బలు, ఆంధ్రామీడియా మోసాలు, టీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందన్న దుష్ప్రచారాలన్నిటిని తట్టుకుని నిలబడటం సామాన్యమైంది కాదు. ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌ వెన్నంటి ఉన్న కొద్ది మందిలో నిరంజన్‌ రెడ్డి ఒకరు. ఈ ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకున్న సీఎం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన నిరంజన్‌రెడ్డికి కేబినెట్‌ స్థాయిలో గుర్తింపునిచ్చి విధులను కేటాయించారు. అంతటి ప్రాధాన్యతగల వ్యక్తిగా నిలబడ్డందుకే నేటి ప్రభుత్వంలో నిరంజన్‌ రెడ్డికి మొదటి వరుసలోనే కేబినెట్‌లోకి చేరే అవకాశాన్ని కల్పించారు. రాటుదేలిన నాయకుడిగా, విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడి అన్ని పరీక్షల్లో నెగ్గుకుంటూ వచ్చినట్లు నిరంజన్‌ రెడ్డి నేటి కేబినెట్‌లో మంత్రి కొలువును అందుకోవడం వనపర్తి ప్రజలు చేసుకున్న అదృష్టంగా నిలుస్తుంది. మంత్రి హోదాలో శాఖ ఏదైనా సరే దానికే వన్నే తెచ్చే విధంగా పని చేయడం నిరంజన్‌రెడ్డికి ఉన్న అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

2812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles