మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు.. స్పందించకుంటే..

Fri,August 24, 2018 07:52 AM

హైదరాబాద్ : విద్యార్థిని కనపడితే చాలు ప్రేమించమని వెంటపడుతున్నారు.. మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు..స్పందించకుంటే బెదిరిస్తున్నారు. యాసిడ్ పోస్తామని హెచ్చరిస్తున్నారు. మెస్సేజ్‌లతో విసిగిస్తున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్న విద్యార్థినులకు షీ ఫర్ హర్ అంగా నిలుస్తోంది. పోలీసుస్టేషన్ చుట్టూ తిరగకుండా తమ కళాశాలలో ఉన్న షీ ఫర్ హర్ బృందానికి సమాచారమిస్తే షీ టీమ్స్ వెంటనే చేరుకొని పోకిరీల భరతం పడుతున్నారు. ఇలా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన షీ ఫర్ హర్ బృందాలకు ఏడాదిలో 17 ఫిర్యాదులు రాగా 20 మంది నిందితులు షీ టీమ్స్‌కు చిక్కి చట్టపరంగా శిక్ష అనుభవిస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 260 అన్ని స్థాయిల కళాశాలలో మొత్తం 520 షీ ఫర్ హర్ బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందాలన్ని బాధిత విద్యార్థినులకు రాచకొండ షీ టీమ్స్‌కు వారధిగా ఉంటూ అండగా నిలబడుతుండడంతో బాధిత విద్యార్థినిలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదుదారుల వివరాలు బయటకు రాకుండా షీ టీమ్స్ చర్యలు తీసుకుంటుండడంతో బాధితుల్లో మరింత ఆనందం వ్యక్తమవుతుంది. వచ్చిన 17 ఫిర్యాదుల్లో ఎక్కువగా విద్యార్థినిలను ప్రేమించమని వెంటపడడం వంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి. నిందితుల్లో విద్యార్థులు, ఆటోడ్రైవర్ వృత్తిలో ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి..
- బీబీనగర్ ప్రాంతానికి చెందిన యువతిని ఓ యువకుడు ప్రేమించమని వెంటపడ్డాడు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరుసగా ఫోన్ చేయడం,మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు. నా సోదరుడు లాంటివాడివని ఆ విద్యార్థిని మొరపెట్టుకున్నా అతను వినలేదు. చివరకు విద్యార్థిని షీ ఫర్ హర్‌ను ఆశ్రయించగా సదరు యువకుడిపై కేసు నమోదైంది.
- నాచారం పోలీసుస్టేషన్ పరిధికి చెందిన ఓ విద్యార్థినికి తరచూ ప్రేమిస్తున్నానని మెసేజ్‌లు వస్తున్నాయి. వెంటనే నెంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఆ యువకుడు కొత్త నెంబరుతో వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఆ విద్యార్థిని షీ ఫర్ హర్ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు.
- వనస్థలిపురం ప్రాంతంలోని ఓ విద్యార్థినికి నిత్యం ప్రేమిస్తున్నానంటూ ఆటోడ్రైవర్ వేధిస్తున్నాడు. భరించలేక ఆ విద్యార్థిని షీ ఫర్ హర్ సహాయాన్ని కోరింది. ఆటోడ్రైవర్‌పై పెట్టీ కేసు నమోదైంది.
- ఉప్పల్ ప్రాంతంలోని ఓ డిగ్రీ కాలేజీ వద్ద ఓ పెయింటర్ తిష్ట వేసి వచ్చి పోయే విద్యార్థులను వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడంతో కొంతమంది షీ ఫర్ హర్‌కు ఫిర్యాదు చేశారు. డెకాయ్ ఆపరేషన్‌తో అక్కడ ఈవ్‌టీజింగ్‌కు ఫుల్‌స్టాప్ పడింది.

షీ ఫర్ హర్ వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా రాచకొండ సీపీ


రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన షీ ఫర్ హర్ వాట్సాప్ గ్రూపులో సీపీ మహేష్ భగవత్ సభ్యులుగా ఉన్నారు. దీంతో సభ్యులు ఏ ఫిర్యాదును పోస్టు చేసినా అది సీపీతోపాటు షీ టీమ్స్ ఉన్నతాధికారుల వరకు సెకన్‌లలో చేరుకుంటుంది. తాజాగా 520 సభ్యులతో షీ ఫర్ హర్ వాట్సాప్ గ్రూపు అందుబాటులో ఉంది. అదే కాకుండా రాచకొండ వాట్సాప్ నెంబరు 9490617111 కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుంది. విద్యార్థినులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ షీ ఫర్ హర్ బృందాలు అనతికాలంలోనే బాధితులకు ఓ భరోసా కేంద్రంగా మారింది. దీంతో ఇప్పుడు ఎవరు కూడా తమ పరువు పోతుందనే అవమాన భారాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వస్తుండడంతో చాలా చోట్ల పోకిరీల బెడద తీరింది. షీ ఫర్ హర్ బృందాలకు కమిషనర్ మహేష్ భగవత్‌తోపాటు షీ టీమ్స్ అధికారులు తరచూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు వారికి ఉన్న హక్కులు, చట్టాల గురించి వివరిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.

5415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles