13 ఏండ్లకే విజేతయ్యాడు

Tue,February 12, 2019 07:04 AM

హైదరాబాద్: రెవిట్ ఆర్కిటెక్చర్, ప్రైమవేరా మెకానికల్ క్యాడ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తదితర సాంకేతిక అంశాలను ఇట్టే అర్థం చేసుకొని.. బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు సైతం బోధిస్తున్నాడు.. ఏడో తరగతి విద్యార్థి హసన్ అలీ. మలక్‌పేటలోని ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్‌లో చదువుతున్న 13 ఏండ్ల హసన్ అలీ తన మేధస్సుతో అందరిని అబ్బురపరుస్తున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో డిజైనింగ్, ఇండ్లు, బ్రిడ్జిల నిర్మాణం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో నట్-బోల్టు నుంచి విమానాలకు డిజైన్‌లు సిద్ధం చేసే వరకూ అన్ని అంశాలను అవపోసన పట్టాడు. సిస్టం వర్కింగ్ టూల్స్ పై పని చేయడం ఎంతో శ్రమతో కూడిన పని.. అలాంటిది అవలీలగా డిజైన్లు రూపొందించడమే కాదు.. ఆయా విభాగాల్లో శిక్షణ ఇస్తున్నాడు 13 ఏండ్ల హసన్.
తండ్రి ప్రోత్సాహంతో..
హసన్ అలీ ప్రతిభ, ఆసక్తిని గుర్తించిన అతడి తండ్రి సాధిక్ అలీ కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ పై ప్రోగ్రామింగ్, డిజైనింగ్ చేసే వాటి పై దృష్టి మళ్లించేలా చేశాడు. తొలుత ఆటో క్యాడ్ సాఫ్ట్‌వేర్ ఆదేశాలను నేర్చుకున్నాడు. క్రమంగా సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన వివిధ టూల్స్, సాఫ్ట్‌వేర్‌లపై పట్టుసాధించాడు. సాయంత్రం హోం వర్క్ పూర్తి చేసుకొని ఇంటర్నెట్‌లో వివిధ అంశాల పై శోధిస్తాడు. 2017 జూలైలో మొదలైన హసన్ అలీ ప్రస్థానం ఇప్పుడు 35 వివిధ రకాల సాఫ్ట్‌వేర్‌లపై డిజైన్‌లు రూపొందించడమే కాకుండా ఇంజినీరింగ్ ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వరకు వచ్చింది.
ఎన్నో అవార్డులు..
హసన్ అలీ అసమాన ప్రతిభకు ఎన్నో సంస్థలు అవార్డులను అందజేశాయి. ఇటీవలే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ యూనో అవార్డుతో సత్కరించింది. యువ ప్రతిభావంతులను గుర్తించేందుకు నిర్వహించిన పోటీల్లో దాదాపు 2.50 లక్షల మంది పాల్గొన్నారు. ఇందులో స్టూడెంట్స్ అచీవర్ ఎడ్యుకేషన్ విభాగంలో హసన్‌అలీ కి 14,335 ఓట్లు వచ్చాయి. విజేతగా నిలిచిన హసన్ అలీకి ఎస్‌బీఐ యూనో అవార్డును అందజేసి సత్కరించింది. అలాగే అమెరికన్-కెనడియన్ ఫెడరేషన్, క్రిసెంట్ యూనివర్సిటీ అవార్డు, పుణె లోని ఆజం క్యాంపస్, ఇంజినీరింగ్ స్టాఫర్ కాలేజీ ఆఫ్ ఇండియా అవార్డులు అందుకున్నాడు.
దేశం కోసం పని చేయాలని..
కంప్యూటర్ గేమ్స్, కార్టూన్స్ అంటూ సమయం వృథా చేయకుండా దేశానికి ఉపయోగపడే విధంగా పని చేయాలనే తనపతో ముందుకు సాగాను. నేను నేర్చుకున్న అంశాలను వేల మందికి చెప్పాలని ఉంది. అందుకే స్కిల్ ఇండియా.. లెర్న్, క్రియేట్, ఎడ్యుకేట్ అనే ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నానని హసన్ అలీ తెలిపారు.

1877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles