ఐటీ రిటర్న్స్ మెసేజ్ పంపి.. లింక్ క్లిక్ చేయమంటారు...

Thu,May 23, 2019 08:30 AM

Send IT Returns Message and cyber fraud

సైబర్ నేరగాళ్లు రోజుకో మోసానికి పాల్పడుతున్నారు. ఇంతకు ముందు ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని, అప్‌డేట్ చేస్తున్నామని, లక్కీ లాటరీ వచ్చిందని తదితర మోసాలకు పాల్పడ్డారు. తాజాగా ఐటీ రిటర్న్స్ మెసేజ్ పంపి ఓ డాక్టర్ నుంచి రూ.10.85 లక్షలు కొట్టేశారు. ఈ నయా ప్రక్రియతో మోసానికి పాల్పడింది నైజీరియన్ చీటింగ్‌గా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మోసానికి సంబంధించి బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం....హైదరాబాద్ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ డాక్టర్‌కు ఈ నెల 9న ఐఎం నోటీఫై పేరుతో మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అందులోని సారాంశం ఐటీ రిటర్న్స్ కింద రూ.17.259లక్షలు వస్తాయని వివరించారు. దీని కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే ఆ ప్రక్రియను పూర్తి చేసి మీ ఖాతాలోకి ఆ నగదును పంపిస్తామని తెలిపారు.

మీరు చేయాల్సింది కేవలం మేము పంపిన లింక్‌లను క్లిక్ చేయాలని కోరారు. ఇది నిజమేనని నమ్మిన డాక్టర్ ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఐటీ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్ తలపించింది. అందులో బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను కూడా అడిగారు. మెసేజ్ పంపింది ఎవరు, ఫోన్‌కు నేరుగా ట్యాక్స్ డిడక్షన్ నగదును దరఖాస్తు చేసుకోమని ఎందుకు పంపించారు, ఇలా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా అన్ని వివరాలను నింపేశాడు. 16న డాక్టర్ ఫోన్‌కు మరో ఆప్‌లైవ్ పేరుతో మెసేజ్, ఆ తర్వాతనే మరో ఐఎం నోటీఫై పేరుతో మరో మెసేజ్ వచ్చింది. అందులో మొబైల్ వెరిఫికేషన్‌ను వెబ్‌సైట్ ద్వారా చేస్తున్నాం..మీరు వెబ్‌సైట్ లింక్‌ను క్లిక్ చేయండని చెప్పారు. అలా క్లిక్ చేయగానే టీ-మొబైల్ యాప్ డాక్టర్ ఫోన్‌లో డౌన్‌లోడ్ అయ్యింది. మీ మొబైల్ వెరిఫికేషన్‌కు దాదాపు 24 గంటలు పడుతుందని మెసేజ్ ద్వారా చెప్పారు. 18న డాక్టర్ తన ఫోన్‌లో ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తన ఖాతాలోని నగదును చెక్ చేసుకున్నాడు. అందులో 17 లావాదేవీల్లో దాదాపు రూ. 10.85 లక్షలు ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించాడు. వెంటనే తన ఏటీఎం, ఖాతా లావాదేవీలను బ్లాక్ చేయించాడు.

టీ -మొబైల్ యాప్ ద్వారానే...
సైబర్ మాయగాళ్లు డాక్టర్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ద్వారా మీ సొత్తు ఇప్పిస్తామని నమ్మించి నకిలీ వెబ్‌సైట్‌తో వివరాలు సేకరించారు. అనంతరం మొబైల్ వెరిఫికేషన్ ద్వారా టీ-మొబైల్ యాప్‌ను డాక్టర్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించారు. ఆ తర్వాత ఈ యాప్ ద్వారా డాక్టర్ ఫోన్‌ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు...ఆ తర్వాత డాక్టర్ ఫోన్‌లో జరుగుతున్న ప్రతి వ్యవహారాన్ని వారి స్క్రీన్ మీద చూసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే 16 టీ-మొబైల్ యాప్ డౌన్‌లోడ్ తర్వాత...18న డాక్టర్ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యంతో తన ఖాతాలోని నగదును చూసుకున్నారు. దీని కోసం మొబైల్ ఫోన్‌లో ఎమ్‌పిన్(మొబైల్ బ్యాంకింగ్ పిన్ నంబర్) నెంబర్, యూజర్ ఐడీ టైప్ చేశారు.

వీటిని టీ-మొబైల్ యాప్ ద్వారా చూసిన మోసగాళ్లు తిరిగి ఆ వివరాల ద్వారా 17 సార్లు లావాదేవీలు జరిపి రూ.10.85 లక్షలు కొట్టేశారని దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా పోలీసులు డాక్టర్ ఖాతాల నుంచి బదిలీ అయిన ఇతర ఖాతాల వివరాలను సేకరించి ఇది నైజీరియన్ మోసంగా నిర్థారించుకుని చీటర్లను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఈ నేర ప్రక్రియ సరికొత్తగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు, సంబంధంలేని సంస్థల నుంచి వచ్చే మెసేజ్, మెయిల్స్ ల జోలికి వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. వాటిలో ఉండే లింక్స్‌ను క్లిక్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. టీ -మొబైల్ యాప్ కేవలం టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి నగదును కొట్టేయాలని సైబర్ క్రిమినల్స్ నయా స్కెచ్‌గా పోలీసులు భావిస్తున్నారు.

471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles