గణపతి నిమజ్జనం కోసం భారీ బందోబస్తు

Sat,September 22, 2018 05:27 AM

security tightened for ganesh immersion at tankbund

మన్సూరాబాద్ : ఈ నెల 23న సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై జరుగనున్న వినాయక నిమజ్జనం కోసం పకడ్బందీగా బం దోబస్తును ఏర్పాటు చేశామని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఎల్బీనగర్‌లోని డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన రూట్‌మ్యాప్ వివరాలను వెల్లడించారు. నిమజ్జనం కోసం సరూర్‌నగర్ చెరువు వద్ద 8 పెద్ద క్రేన్‌ల ఏర్పాటుతోపాటు మరో మూడు మొబైల్ క్రేన్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చే సిన రెండు వాచ్ టవర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తామని తెలిపారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజల కోసం 10 మొబైల్ టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు సుమారు 30 సీసీటీవీ కెమెరాలు, వివిధ ప్రాంతాల్లో 60 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని, సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై 300 మంది పోలీసులు ఉన్నారని తెలిపారు. అలాగే ఫైర్ సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, మెడికల్ టీమ్‌లు, అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయని , మహిళల రక్షణ కోసం షీటీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. నిమజ్జనాల ఊరేగింపులో డీజేలకు అనుమతిలేదని.. అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా బాణాసంచాలు కాల్చడం.. రంగులు విరజిమ్మడం లాంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన ప్రజలకు సూచించారు. అలాగే నిమజ్జనానికి ఎల్బీనగర్ జోన్‌లోని ఇమామ్‌గూడ చెరువు, ఇబ్రహీంపట్నం పరిధి శేరిగూడెం చెరువు, తట్టిఅన్నారం చెరువు, జల్‌పల్లి, మన్సూరాబాద్ పెద్దచెరువు, నాగోల్ చెరువుల్లో ఏర్పాట్లు చేశామన్నారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేయాలని డీసీపీ తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు


వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈనెల 23న ఉద యం 6 నుంచి 24న ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్‌నాయుడు తెలిపారు. వినాయక నిమజ్జనం కోసం హయత్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, సరూర్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు నుంచి కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, వెంకటాద్రి థియేటర్ సమీపంలోని జేసీ బ్రదర్స్ పక్కన ఉన్న ఎడమ వైపు రోడ్డు గుండా శివగంగా థియేటర్, శంకేశ్వర్‌బజార్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. అలాగే చాదర్‌ఘాట్, మలక్‌పేట్, ముసారంబాగ్, అంబర్‌పేట్ వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాలు ముసారంబాగ్ క్రాస్ రోడ్డు, కోణార్క్ డయాగ్నస్టిక్ నుంచి యూటర్న్ తీసుకుని గడ్డిఅన్నారం క్రాస్‌రోడ్డు, శివగంగా థియేటర్, శంకేశ్వర్ బజార్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాన్నారు. సైదాబాద్, సంతోష్‌నగర్, ఐఎస్‌సదన్, నాగార్జునసాగర్ రోడ్డు నుంచి వచ్చే వినాయకులు సింగరేణికాలనీ, శంకేశ్వర్‌బజార్ మీదుగా సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమజ్జనం అనంతరం తమ వా హనాలను కర్మన్‌ఘాట్ లేదా సరూర్‌నగర్ పోస్ట్‌ఆఫీస్ మీదుగా తీసుకువెళ్లాలని తెలిపారు.

సఫిల్‌గూడ చెరువుపై ...


వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని సఫిల్‌గూడ చెరువుపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజలు సఫిల్‌గూడ చెరువు ఎంట్రన్స్ గేటు, వెంకటేశ్వర స్వీటు హౌజ్ దాటి లోపలికి వెళ్లేందుకు వాహనాలను అనుమతించరు. అదేవిధంగా సఫిల్‌గూడ చెరువు నుంచి నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్డు మార్గంలో, సఫిల్‌గూడ నుంచి ఆనంద్‌బాగ్ క్రాస్‌రోడ్డు మార్గం, సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ నుంచి సఫిల్‌గూడ చెరువు మార్గంలో వాహనాలకు అనుమతి లేదు.

కాప్రా చెరువుపై...


వినాయక నిమజ్జనం సందర్భంగా కాప్రా చెరువుపై సందర్శకుల వాహనాలను అనుమతించరు. నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చేవారు తమ వాహనాలను కాప్రాలోని హైటెన్షన్ పవర్ ట్రాన్స్‌మిషన్ లైను రోడ్డులో ఇరువైపులా పార్కు చేసుకోవాలి.

పార్కింగ్ సదుపాయం


వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనదారులకు పలు ప్రాంతాల్లో పా ర్కింగ్‌ను ఏర్పాటు చేశారు. జ్యోతిక్లబ్, సరస్వతి శిశుమందిర్, జిల్లాపరిషత్ స్కూల్, సరూర్‌నగర్ పోస్ట్‌ఆఫీస్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద తమ వాహనాలను పార్కు చేసుకోవాలి.

భారీ వాహనాల నిషేధిత ప్రాంతాలు
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈనెల 23న ఉద యం 6 నుంచి 24న ఉదయం 6 గంటల వరకు బైరామల్‌గూడ నుంచి చంపాపేట, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్, ఉప్పల్ నుంచి రామంతాపూర్, నేరేడ్‌మెట్ నుంచి సఫిల్‌గూడ చెరువు, ఆర్కేపురం నుంచి ఈసీఐఎల్ మార్గంలో భారీ వాహనాలను అనుమతించరు.

పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులకు అనుమతి లేదు


వినాయక నిమజ్జనం సందర్భంగా గడ్డిఅన్నారం నుంచి శంకేశ్వర్‌బజార్, సైదాబాద్ నుంచి సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి రామంతాపూర్, నేరేడ్‌మెట్ నుంచి సఫిల్‌గూడ చెరువు, ఏఓసీ గేట్ నుంచి సఫిల్‌గూడ చెరువు, ఆనంద్‌బాగ్ నుంచి సఫిల్‌గూడ చెరువు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులకు అనుమతిలేదు. అదేవిధంగా ఎల్బీనగర్ కామినేని ైఫ్లెఓవర్ పై నుంచి వినాయక విగ్రహాల వాహనాలకు అనుమతి లేదు. ఈ సమావేశంలో రాచకొండ అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ దివ్యచరణ్‌రావు, ఎల్బీనగర్ ఏసీపీ పృధ్వీధర్‌రావు, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహారెడ్డి, సరూర్‌నగర్ సీఐ రంగస్వామిలు పాల్గొన్నారు.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles