ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన రెండో భార్య

Tue,February 13, 2018 09:25 PM

second wife killed her husband with lover

తిరుమలగిరి : నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం ఉప సర్పంచ్ దేపావత్ ధర్మానాయక్(45) దారుణహత్యకు గురయ్యాడు. మంచం కింద బాంబు పెట్టి పేల్చడంతో శరీరం చిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. ధర్మానాయక్ రెండో భార్య శిరీష ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు.

చింతలపాలెం ఆవాసం నాగార్జునపేట తండాకు చెందిన ధర్మానాయక్‌కు సమీపంలోని జమ్మన్‌కోటకు చెందిన సావిత్రితో ఇరవైఏండ్ల కిందట వివాహమైంది. సంతానం కలుగకపోవడంతో పదేళ్ల కిందట సావిత్రి చెల్లెలు శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. కొన్నాళ్లుగా తమ ఇంటి సమీపంలోని ఆంగోతు రవినాయక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీష.. తమ కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడానికి పథకం వేసింది.

సావిత్రి వేరుశెనగ చేనుకు నీరు పెట్టడానికి పెద్దకూతురును తీసుకుని వెళ్లడంతో ధర్మానాయక్ తన కుమారుడు నర్సింహతో కలిసి ఆరుబయట మంచంలో నిద్రపోయాడు. శిరీష చిన్నకూతురుతో కలిసి లోపల నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో భర్త వద్ద పడుకున్న కొడుకును సైతం ఇంట్లోకి తీసుకొని వెళ్లింది. పథకం ప్రకారం రవి, శిరీష కలిసి ధర్మానాయక్ మంచం కింద బాంబు పేల్చారు. దీంతో ధర్మానాయక్ వీపుభాగం నుజ్జునుజ్జై అవయవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు శబ్ధంతో ఉలిక్కిపడిన ఇరుగుపొరుగు.. ధర్మానాయక్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆయన రక్తపుమడుగులో పడి ఉన్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు నల్లగొండ నుంచి డాగ్‌స్కాడ్, క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ధర్మానాయక్ తల్లి ద్వాళి ఫిర్యాదు మేరకు సాగర్ సీఐ రవీందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శిరీషపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రవి పరారీలో ఉన్నాడు. తండాలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. హత్యకు వివాహేతర సంబంధమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పటాకుల ద్వారా సేకరించిన మందుగుండు సామగ్రిని ఒకే సారి పేల్చడం లేదా.. అడవి పందుల వేటలో ఉపయోగించే నాటుబాంబును ఉపయోగించి ఉండవచ్చని వెల్లడించారు.

6416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS