రైతును ఆర్దికంగా బలోపేతం చేయడమే లక్ష్యం: గుత్తాTue,March 13, 2018 08:41 PM

రైతును ఆర్దికంగా బలోపేతం చేయడమే లక్ష్యం: గుత్తా

యాదాద్రి భువనగిరి : రైతులను సంఘటితం చేయడమే లక్ష్యంగా సమన్వయ సమితి కార్యాచరణ ఉంటుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతును ఆర్దికంగా బలోపేతం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యమన్నారు. రైతులు సంఘటితంగా లేకపోవడం వల్లనే సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. రైతులు అన్ని విధాలుగా ఎదిగేందుకు సమన్వయ సమితి కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు చర్యలు చేపడుతామన్నారు. గ్రామాల్లో గల రైతులకు యాంత్రీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలను తెలుసుకునేందుకు యాంత్రీకరణ సర్వే కూడా చేపట్టామని తెలిపారు. ట్రాక్టర్లు, హార్వేస్టర్లు తదితర వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్ల వివరాలను ఇప్పటికే సేకరించామన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పండ్ల తోటల అధికారుల సమన్వయంతో రైతు సమన్వయ సమితి బృహత్తర కార్యక్రమాన్ని రాబోయే ఆరునెలల కార్యాచరణను తీసుకున్నదని చెప్పారు. వ్యవసాయ, విద్యుత్, పౌరసరఫరాలు, ఆర్థిక, మార్కెటింగ్ శాఖ, మత్స్యశాఖ మంత్రుల సమన్వయంతో కార్యాచరణ కొనసాగుతుందన్నారు. ఎరువులు, విత్తనాలు అందజేసే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

నియోజకవర్గ కేంద్రాల్లో ఆగ్రో ఆధారిత పరిశ్రమలు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఆగ్రో ఆధారిత పరిశ్రమలను ప్రారంభించబోతున్నట్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. వ్యవసాయం ఎలా చేయాలి..వ్యవసాయం లాభసాటి అని నిరూపించడానికి దేశానికి వెన్నెముకయిన రైతును ప్రోత్సహించడానికి సమన్వయ సమితి కృషి చేస్తుందన్నారు. మే 1 నుంచి వ్యవసాయానికి పెట్టుబడి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 61 వేల సభ్యత్వంలో సమితి ఏర్పడిందని అన్నారు. రైతులందరిని సమన్వయం చేసి మంచి దిగుబడి సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయంపై తగిన విధంగా శిక్షణను ఇస్తామని అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేస్తామని అన్నారు. రైతులకు ఆధునిక పనిముట్లు,విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. రైతులకు ఇప్పటి వరకు సంఘం లేదని ఇప్పుడు సమితి ఏర్పాటుతో సీఎం కేసీఆర్ ఆ కొరత తీర్చారని అన్నారు.

సమితి ఏర్పాటుతో రైతులకు భరోసా
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సీఎం కేసీఆర్ ఈ విధంగా సమితిని ఏర్పాటు చేసి రైతుకు భరోసా కల్పించారని అన్నారు. ప్రతి రైతు పొలంలో తగిన విధంగా భూమి పరీక్షలు చేయించి ఎక్కడ ఏ విధమైన పంటలు పండుతాయో అలాంటి పంటలే వేసేలా చూస్తామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా భీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నదని తెలిపారు. 72 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామని అన్నారు. యాదాద్రిని రూ. 2 వేల కోట్లతో 2 వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రికి సీఎం కేసీఆర్ ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్మాక్స్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఆలేరు, భువనగిరి మార్కెట్ కమిటి చైర్మన్లు కాలె సుమలత, పంతులునాయక్, యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్నారవీందర్, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ కర్రె కమలమ్మ, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి ఆరె యాదగిరి, నార్మాక్స్ డెయిరీ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కల్లూరి బాల్‌రెడ్డి, గొట్టిపర్తి బాలరాజు, బోరెడ్డి రాంరెడ్డి, జిన్నా మాధవరెడ్డి, ఆర్కాల గాల్‌రెడ్డి, పాండవుల భాస్కర్, ఆత్మకూరు రాంనర్సయ్య, ఎం. కొండల్‌రెడ్డి, బండపల్లి నరేష్, చిత్తర్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS