రైతు బంధు సూపర్‌హిట్.. అంతర్జాతీయ సంస్థ సర్వేలో వెల్లడి

Mon,June 4, 2018 01:05 PM

Rythu Bandhu scheme is huge hit, informs J-PAL report

హైదరాబాద్: రైతు బంధు పథకం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నది. పంట పెట్టుబ‌డి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు 12వేల కోట్లు ఖర్చు చేయనున్నది. ఇటీవలే ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి ఎకరాకు 4వేలు రూపాయలు ఇస్తున్నది. అయితే రైతు బంధు పథకం దేశంలోని ఇతర రాష్ర్టాలతో పాటు ప్రపంచ దేశాలను కూడా ఆకట్టుకున్నది. ఈ పథకంపై తాజాగా అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్(జే-పీఎల్‌ఎల్) అనే పరిశోధన సంస్థ తెలంగాణలో సర్వే చేపట్టింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉన్నది. మసచూటస్ ఇన్స్‌టిట్యూట్ టెక్నాలజీ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇండియాలోనూ ఈ సంస్థ కార్యాలయం ఉన్నది. అబ్దుల్ లతీఫ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఆ సంస్థ మరెన్నో పరిశోధనలు కూడా చేస్తుంది. ఆ పరిశోధనలు అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తుంది. అబ్దుల్ లతీఫ్ సంస్థకు అంతర్జాతీయంగా విశేష గుర్తింపు కూడా ఉన్నది. ఆ సంస్థ కోసం సుమారు 161 మంది వర్సిటీ ప్రొఫెసర్లు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంటారు.

కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమే లక్ష్యంగా రైతు బంధు పథకాన్ని చేపట్టింది. ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించిన ఈ పథకం రాష్ట్ర రైతులను అమితంగా సంతోషపరుస్తున్నది. అబ్దుల్ లతీఫ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రైతు బంధు పథకంపై సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. రైతు బంధు స్కీమ్‌పై ర్యాండమ్ శ్యాంప్లింగ్ ద్వారా సర్వే చేపట్టారు. రైతు బంధు పథకంపై రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఈ పథకంపై రైతులు అనేక ఆసక్తికర అంశాలను వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సర్వేను నాలుగు రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఇంకా ప్రాథమిక స్థాయిలోనూ సర్వే కొనసాగుతున్నది. హై ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ ఇన్ పర్సన్ ఫోన్ సర్వే మరియు ఐవీఆర్‌ఎస్ పద్దతుల్లో రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. రైతు బంధు పథకం ఎలా అమలు జరుగుతుంది, అది ఎలా ఉపయోగపడుతుందన్న కోణాల్లో సర్వేను సునిశితంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సర్వే ద్వారా ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉందో తెలుస్తోందని అధికారులంటున్నారు.

అబ్దుల్ లతీఫ్ సంస్థకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఓ కాల్ సెంటర్ ద్వారా ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ సర్వే నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు సుమారు 10వేల మంది రైతులతో మాట్లాడారు. రైతు బంధు పథకంపై వాళ్లు అభిప్రాయాలను సేకరిస్తూనే ఉన్నారు. కొన్ని ప్రశ్నలు వేస్తూ .. రైతుల నుంచి సమాధానాలను రాబడుతున్నారు. అయితే ఆ సంస్థ వేసిన‌ అన్ని ప్రశ్నలకు గత నాలుగు రోజుల్లో సుమారు 5700 మంది రైతులు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇచ్చారు. రానున్న పది రోజుల్లో సుమారు 20 వేల మంది రైతులను ప్రశ్నించాలని ఆ సంస్థ భావిస్తున్నది. ఇక ఐవీఆర్‌ఎస్ పద్ధతిలో సుమారు 40 వేల మంది లబ్ధిదారుల నుంచి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు జరిగిన సర్వేలో రైతు బంధు పథకం ద్వారా పాస్‌పుస్తకాలు, చెక్‌లు అందుకున్న వారు 81 శాతం మంది ఉన్నట్లు అంచనా వేశారు. మరో 12.4 శాతం మంది మాత్రం ఏమీ దక్కలేదన్నారు. చిన్న, సన్నకారు, భూస్వాములు చెక్‌లు అందుకున్న అంశంపై కూడా ఆసక్తికర విషయం బయటపడింది. ఎక్కువ శాతం రైతులు.. 10వేల నుంచి 20 వేల వరకు చెక్‌లు అందుకున్నారని సర్వే పేర్కొన్నది. ఆ సంఖ్య సుమారు 28 శాతం ఉందని సర్వే స్పష్టం చేసింది. ఇక 6వేల నుంచి 10వేల చెక్‌లు అందుకున్నవారిలో 21.4శాతం రైతులు ఉన్నారు. సన్నకారులో 3వేల నుంచి 6వేలు అందుకున్న వారిలో 24 శాతం రైతులు ఉన్నట్లు తేలింది. ఇక బడా రైతుల్లో 50వేలకు పైగా చెక్‌లను అందుకున్నవారిలో 0.8శాతం మంది రైతులు మాత్రమే ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.

సర్వేకు స్పందించిన రైతులు కొన్ని సూచనలు కూడా చేశారు. ఎక్కువ భూమి ఉన్న వారికి .. పెట్టుబడి సాయంపై కొంత నియంత్రణ ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎకరాలతో సంబంధం లేకుండా.. ప్రభుత్వం ప్రతి ఎకరాకు 4 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. మొత్తంమీద రైతు బంధు స్కీమ్ వల్ల సుమారు 89 శాతం రైతులు ఆనందంగా ఉన్నట్లు తేలింది. పంట సాయం కోసం ఇచ్చిన అమౌంట్‌పై రైతుల్లో నిరాశ లేదన్న విషయం కూడా స్పష్టమైంది. తమకు ఉన్న భూమికి, ఇచ్చిన చెక్‌లకు .. అన్నీ సరిపోయినట్లు సుమారు 86.6శాతం మంది వెల్లడించారు. అంతేకాదు చెక్‌లు అందుకునే సమయంలో.. 96 శాతం మంది రైతులు ఎటువంటి సమస్యను ఎదుర్కోలేదని తెలిపారు. కేవలం 2.5 శాతం మంది మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.

6157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles