ఆర్టీసీకి 'ఎన్నికల' కళ..

Mon,April 15, 2019 08:26 AM

RTC   Gets Huge Profits In elections season

హైద‌రాబాద్‌: పండుగ సీజన్ల వేళ ప్రత్యేక బస్సులు వేసి ఆదాయ వనరులు రాబట్టుకొనే టీఎస్‌ఆర్టీసీకీ ఈ నెలలో బంపర్ ఆఫర్ తగిలింది. మొదటివిడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు వేయడానికి నగరం నుంచి దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ నగరం నుంచి 4573 బస్సులను ఆపరేట్ చేసింది. ఈ నెల 8 నుంచి 11వరకు ప్రతిరోజు సగటున లక్ష మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతీరోజు నగరం నుంచి 3 వేల బస్సులతోపాటు సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తుంటారు. 3 వేల బస్సులకు అదనంగా 1573 బస్సులను ఎన్నికలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసింది.

ప్రయాణికుల సౌలభ్యం కోసం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్‌తోపాటు నగర శివారు కాలనీల నుంచి బస్సులను నడిపించారు.అంతేగాకుండా అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లు బుక్‌చేసి అక్కడినుంచే బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పారు.అంతేగాకుండా అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. వీటితోపాటు కరీంనగర్, వరంగల్ , నల్గొండ, నిజామాబాద్ , ఆదిలాబాద్ సెక్టార్‌లకు రెగ్యులర్ బస్సులను ఎక్కువగా తిప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు స్పెషల్ ఆపరేషన్స్ కోసం ఎంతో సహకరించారు. ఒక్క 10వ తేదీనే 1117 అదనపు బస్సులు నడిపించారు.

నగర రైల్వేస్టేషన్ల ద్వారా 5.59 లక్షల మంది ప్రయాణం

ఎన్నికల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రికార్డుస్థాయి ప్రయాణికులను రిజిస్టర్ చేసింది. ఈ నెల10న ఒక్కరోజే 1,24,000 మంది ప్రయాణికులు ప్రయాణించి రికార్డును నమోదుచేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్కరోజే 96,000 మంది అన్‌రిజర్వ్‌డ్‌గా 28 వేలమంది రిజర్వ్‌డ్ ప్రయాణికులు ప్రయాణించారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు అదనపు బోగీలను ఏర్పాటుచేసింది. నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ , లింగంపల్లి స్టేషన్ల ద్వారా అత్యధిక ప్రయాణికులు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరారు. మొత్తం 8,9,10 తేదీలలో కలిస్తే 2,41,046 అన్‌రిజర్వుడ్ ప్రయాణికులు, 97,512 రిజర్వ్‌డ్ ప్రయాణికులు కలిసి 3,38,558 మంది ప్రయాణికులు సికింద్రాబాద్ ఒక్క స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

హైదరాబాద్(నాంపల్లి) స్టేషన్ నుంచి 52,785 అన్‌రిజర్వ్‌డ్, 17,446 మంది రిజర్వ్‌డ్ కలిపి 70,231 మంది, లింగంపల్లి స్టేషన్ నుంచి 79,596 అన్‌రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్ 5,786 రిజర్వుడ్ కలిపి 85,382 మంది ప్రయాణికులు, కాచిగూడ స్టేషన్ నుంచి 59,560 అన్‌రిజర్వుడ్,4817 రిజర్వ్‌డ్ కలిపి 64,377 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అన్ని స్టేషన్లు కలిపి 4,32,987 అన్‌రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్ 1,25,561 మంది కలిపి మొత్తం 5,58,548 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.

1502
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles