కాళేశ్వరం తెలంగాణకే వరప్రదాయిని: విశ్రాంత ఇంజినీర్ల సంఘం

Tue,June 18, 2019 04:35 PM

Retired Engineers Association talks on kaleshwaram project

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు తెలంగాణకే వరప్రదాయిని అని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాల విమర్శలు, వదంతులు, అపోహలపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రెస్‌క్లబ్‌లో నేడు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం తెలంగాణకే వరప్రదాయిని అన్నారు. ఒక ఏడాది వర్షం రాకున్నా ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణకు సైతం నీళ్లు తీసుకుపోవొచ్చునని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న సమయంలో అడ్డంకులు సృష్టించవద్దని విన్నవించారు. జాతీయ ప్రాజెక్టు హోదా కోసం కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అపోహలను ప్రజలు నమ్మొద్దని కోరారు.

ఎంతో ప్రయోజనం చేకూర్చే కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను ప్రతిపక్ష నేతలు వ్యతిరేకించొద్దని రిటైర్డ్ ఇంజినీర్ వెంకటరామారావు అన్నారు. 36 లక్షల సాగు జరిగేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని తెలిపారు. 141 రిజర్వాయర్లు, ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవ పథకాన్ని ఇందులో చేర్చారన్నారు. ప్రాణహిత నీటిని సద్వినియోగం చేసుకోవడానికి 2004 కంటే ముందే ప్రాజెక్టు నివేధిక సిద్ధం చేసినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదు నివేదిక తయారు చేయమన్నారు. జులైలో ఎస్సారెస్పీ నింపుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇక తెలంగాణలో నీటి కొరత ఉండదన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ సరికాదని పేర్కొంటూ జయప్రకాష్ నారాయణ మరోసారి తన దుష్ట బుద్ది చాటుకున్నారని విశ్రాంత ఇంజినీర్ చంద్రమౌళి అన్నారు. రీ డిజైన్ చేస్తే అధిక ప్రయోజనమని ఆ మేరకు ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ప్రయోజనం కలగడం కోసం ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధాకారమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలకు ఎంతో లాభం కలుగుతుందన్నారు.

విపక్షాల దుష్ప్రారాన్ని ప్రజలు నమ్మొద్దు. జయప్రకాష్ నారాయణ అపోహలు సృష్టిస్తున్నారని రిటైర్డ్ ఇంజినీర్ భూమయ్య అన్నారు. ఎకరానికి రూ. 46 వేలు ఖర్చు అవుతుందనేది అబద్ధమన్నారు. ఎకరానికి రూ. 1200 నుంచి రూ. 1500 వరకు మాత్రమే ఖర్చవుతుందని తెలిపారు. విద్యుత్ బిల్లులు ప్రభుత్వం ఉచితంగానే ఇస్తోందన్నారు. కాళేశ్వరం బహుళార్దక సాధక ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

రిటైర్డ్ ఇంజినీర్ జనార్దన్ స్పందిస్తూ.. మనకు లిఫ్ట్ ద్వారానే నీటి లభ్యత ఉందన్నారు. ప్రత్యామ్నాయం లేదన్నారు. నాగార్జునసాగర్ పూర్తై 45 ఏైళ్లెనా ఇంకా కాల్వలు తవ్వుతున్నారన్నారు. తెలంగాణకు మొదటి నుంచి అన్యాయం జరిగింది. ఇంత త్వరగా ఏ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వలేదు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం గొప్ప విషయం. ఏ ప్రాజెక్టుతో కూడా ఇంత త్వరగా నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టులకు విపక్షాలు అడ్డుపడడం సరికాదన్నారు.

2344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles