జీవవైవిధ్యంపై ఓయూలోనూ పరిశోధనలు

Fri,June 14, 2019 09:29 AM

Research in Osmania University  on biodiversity

సాంకేతికత అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో వాతావరణ పరిస్థితులు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. విపరీతమైన ఎండలు, వానలు, కరువు, తుఫాను వంటి ప్రకృతి విపత్తులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనికంతటికీ కారణం జీవవైవిధ్యం అంతరించిపోవడమే. అటువంటి జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ నడుం బిగించింది. జీవవైవిధ్య పరిశోధనలు నిర్వహించేందుకు ఓయూలో సెంటర్ ఫర్ బయో డైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ స్టడీస్‌ను ప్రారంభిస్తున్నారు. ఇందులో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు తీసుకోవలసిన చర్యలు, జీవవైవిధ్య విస్తరణకు అవకాశం ఉన్న ప్రదేశాలు, పరిస్థితులు, అరుదైన జీవాలు, వృక్షాలను సంరక్షించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తారు. తద్వారా భవిష్యత్ తరాలను విపరీత వాతావరణ మార్పుల ద్వారా జరిగే దుష్పరిణామాలకు లోనుకాకుండా కాపాడుకోవచ్చు.

విభాగానికి వేదికగా ఓయూ


ఉస్మానియా యూనివర్సిటీలోని వివిధ విభాగాలు గత ఇరవై ఏండ్లుగా రాష్ట్రంలో జీవవైవిధ్యంపై పరిశోధనలు చేసిన అనంతరం కేంద్రాన్ని ఓయూలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనేక ఏండ్లుగా చేస్తున్న పరిశోధనలు కొనసాగించడంతో పాటు అరుదైన జీవాలు, వృక్షాలను పెంపొందించేందుకు అనువైన ప్రదేశంగా ఓయూ క్యాంపస్‌ను భావిస్తున్నారు. జీవ వైవిధ్యంలో వచ్చే మార్పులతో వాతావరణంలో తీవ్ర మార్పులపై కూడా ఇక్కడ పరిశోధనలు జరుగనున్నాయి.

రూసా నిధులతో పరిశోధన కేంద్రం ఏర్పాటు


ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) 2.0 పథకం కింద దేశంలోని పలు యూనివర్సిటీలకు నిధులను అందజేసింది. ఈ పథకం కింద ఓయూకు రూ.107 కోట్లు మంజూరు కాగా, ఆ నిధుల నుంచి రూ.ఆరు కోట్లను ఈ కేంద్రానికి కేటాయించారు. ఈ నిధులలో నూతన భవన నిర్మాణం కోసం రూ.2.5 కోట్లు కేటాయించగా, మిగిలిన నిధులను మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నారు. ఈ కేంద్రంలో జువాలజీ, బోటనీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తదితర విభాగాల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పరిశోధనలు కొనసాగించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు


ఓయూలో ఏర్పాటు చేస్తున్న ఈ విభాగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన తోడ్పాటును అందజేస్తున్నది. కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, జీవ వైవిధ్య మండలి అనుమతులను ఇప్పటికే తీసుకున్నారు. మొదటగా ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలో ఉన్న జీవ వైవిధ్య సమగ్ర సూచీని తయారుచేయనున్నారు. అంతరించిపోతున్న, ప్రస్తుతం ఉన్న జీవుల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కేంద్రం సూచనలు చేస్తుంది. ఓయూ, జీవ వైవిధ్య మండలి కలిసి చేసిన పరిశోధనలలో రాష్ట్రంలో 150కి పైగా అరుదైన జీవజాతులు ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. వీటి సంరక్షణను పెంచుతూ, ఉత్పత్తిని పెంపొందించేందుకు ఈ కేంద్రం సూచిస్తుంది.

382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles