చేవెళ్ల బరిలో రంజిత్ రెడ్డి..నేడు నామినేషన్

Fri,March 22, 2019 08:22 AM

Ranjithreddy as chevella candidate to files nomination Today


వికారాబాద్‌ జిల్లా: చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి పేరును ప్రకటించారు. మొదట్నంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వ్యాపారవేత్త అయిన రంజిత్‌ రెడ్డివైపే సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు మొగ్గు చూపారు. అంతేకాకుండా గత 35 ఏండ్లుగా చేవెళ్ల ప్రాంతంతో సంబంధం కలిగి ఉండడం కూడా రంజిత్‌ రెడ్డికి కలిసివచ్చింది. అయితే చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థులుగా తొలుత మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, తదనంతరం కార్తీక్‌ రెడ్డి పేర్లు వినిపించినప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం రంజిత్‌ రెడ్డిని బరిలో దింపింది. అంతేకాకుండా సౌమ్యుడిగా, అందరిని కలుపుకుపోయే వ్యక్తిత్వంగల వారు కావడంతో డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డికి టికెట్‌ను కేటాయించారు.

2004లో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం పొందిన రంజిత్‌ రెడ్డి అప్పటినుంచి వ్యాపారంతోపాటు పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా చేవెళ్ల ప్రాంతంలో ఎస్‌ఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ పేరిట ఎన్నో పౌల్ట్రీ పరిశ్రమలను నెలకొల్పడంతోపాటు చాలా గ్రామాలను దత్తత తీసుకొని వేలాది కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు జీవనోపాధి కల్పిస్తూ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు సుపరితులైన డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి గెలుపు ఖాయమంటున్నారు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశమిచ్చినందుకుగాను సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టెక్నాలజీ సలహాదారు నుంచి ఎండీ వరకు..డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి స్వస్థలం వరంగల్‌ జిల్లా. అయితే పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఆయన తండ్రి రాజ్‌రెడ్డి ఆలోచనతో రంజిత్‌ రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాజేంద్రనగర్‌లోని ఏజీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్‌లో యూజీ, పీజీ పూర్తి చేశారు. తదనంతరం రంజిత్‌ రెడ్డి చేవెళ్ల మండలం అంతారంలోని పౌల్ట్రీ ఫార్మ్‌లో టెక్నాలజీ సలహాదారుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఆరేళ్లపాటు టెక్నాలజీ సలహాదారుగా పనిచేసిన ఆయన ఫౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాన్ని సంపాదించిన ఆయన డాక్టర్‌ తిరుపతిరెడ్డితో కలిసి ఎస్‌ఆర్‌ హచ్చెరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించారు. తదనంతరం పౌల్ట్రీ పరిశ్రమ విజయవంతం కావడంతో చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఎన్నో పౌల్ట్రీ పరిశ్రమలను రంజిత్‌ రెడ్డి నెలకొల్పారు. ఎస్‌ఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న రంజిత్‌ రెడ్డి తెలంగాణతోపాటు దేశంలోనే పౌల్ట్రీ పారిశ్రామిక రంగంలో ప్రధాన శక్తిగా తయారయ్యారు. అంతేకాకుండా తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పౌల్ట్రీ పరిశ్రమల్లో సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రభుత్వానికి సమస్యలను వివరించి పరిష్కారం చూపడంలో రంజిత్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

గెలుపు ఖాయం...చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని బరిలో దింపారు. అయితే చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం మొత్తంగా చూసినా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందేందుకే అధిక అవకాశాలుండడంతోపాటు రంజిత్‌ రెడ్డి తొలిసారి పోటీ చేస్తుండడంతోపాటు వ్యాపారవేత్తగా ఉండి ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడంతోపాటు వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తుండడంతో ప్రజలు రంజిత్‌రెడ్డిని గెలిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి చేయని విశ్వేశ్వర్‌ రెడ్డికి బదులు కొత్తగా బరిలో దిగనున్న రంజిత్‌ రెడ్డివైపే అన్ని వర్గాల ప్రజలు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసినప్పటికీ జిల్లాలోని పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాలతోపాటు చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించింది. అయితే మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరనుండడం, ఇప్పటికే కార్తీక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ బలం మరింత పుంజుకుందనే చెప్పవచ్చు. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి,..ఆయనను గెలిపించిన టీఆర్‌ఎస్‌ పార్టీని మోసం చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఎంపీగా ఉన్న ఐదేండ్ల కాలంలో పైసా పనిచేయలేరనే విమర్శలతోపాటు దత్తత తీసుకున్న గ్రామంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు...


చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టికెట్‌ కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే కనీవినీ ఎరుగనిరీతిలో సంబంధిత నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తాను. విద్య, ఆరోగ్య సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారించడంతోపాటు యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తాను. ఈ ప్రాంతం నుంచి ఏ ఒక్కరు కూడా వలస వెళ్లకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతాను.
- చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి

1450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles