ఆగ్నేయ రాజస్థాన్ పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్ప పీడనం

Sun,September 23, 2018 08:19 PM

rain possibility in telangana with in three days

హైదరాబాద్ : ఆగ్నేయ రాజస్థాన్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ నైరుతి దిశగా తిరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ అండమాన్ ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపునకు తిరుగుతుందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

విదర్భ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర వాయవ్యదిశగా ప్రయాణించి బలహీనపడింది. దీని కారణంగా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, మంథని, ఉట్నూర్, నిర్మల్‌లలో 10 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్ర అల్పపీడనం కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలుగా నమోదైంది. సాయంత్రానికి గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురియడంతో వాతావరణం చల్లబడింది.

4220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS