నేనెల్త బిడ్డో సర్కారు దవాఖానకు...

Thu,January 24, 2019 08:01 AM

public health centers development in telangana

హైదరాబాద్ : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకప్పటి మాట.. తెలంగాణ ఏర్పాటు తర్వాత నేనెల్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారు పేదలు. ఉస్మానియా దవాఖానలో ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో ఓపీ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 2018లో ఈ సంఖ్య 9 లక్షల 56 వేల 123కు చేరుకున్నది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. నూతనంగా మరో 5 ఫార్మ సీ కౌంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.

ఉస్మానియా దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. 2014లో 5 లక్షల 6 వేల 994గా ఉన్న ఓపీ సంఖ్య 2018లో 9 లక్షల 56 వేల 123కు చేరుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దవాఖానను సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. నిత్యం దవాఖానకు సుమారు 3000 మంది ఓపీకి వస్తుంటారు. వీరిలో వంద నుంచి రెండు వందల మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుండగా మిగిలిన వారు ఔట్ పేషెంట్ విభాగంలో వైద్యం చేయించుకొని వెళ్తారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య పరికరాలు, డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. 8 ఫార్మసీ కౌంటర్లు ఉండగా ఇటీవల మరొకటి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఓపీ పెరుగడంతో మరో 5 కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరో 5 ఫార్మసీ కౌంటర్లు..

ఉస్మానియా దవాఖానలో మరో 5 నూతన ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు దవాఖాన పాలక వర్గం కృషి చేస్తున్నది. గతంలో కంటే సుమారు 4 లక్షల వరకు ఓపీ పెరగడంతో దీన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. 2014లో 8 ఫార్మసీ కౌంటర్లు కొనసాగేవి. 2018లో 9 లక్షల 56 వేల 123 మంది ఓపీలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వస్తుండటంతో మరో 5 ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేయాలని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు.

2014లో అత్యల్పం... 2018లో అత్యధికం

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉస్మానియా దవాఖానకు నిధులను భారీగా కేటాయించడంతో ఓపీకి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. 2014లో 5 లక్షల 6వేల 994 గా ఉన్న సంఖ్య 2015లో 5 లక్షల 60 వేలకు, 2016లో 6 లక్షల 20 వేలకు, 2017లో 7లక్షల 27 వేల 937కు, 2018లో 9 లక్షల 56 వేల 123కు చేరింది. 2014లో దవాఖానలో 45 వేల అడ్మిషన్లు జరుగగా, 52 వేల మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించారు. 2018లో 47 వేల 651 అడ్మిషన్లు జరుగగా, 61 వేల 568 మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించారు. దవాఖానలో 2018 వరకు 694 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. దవాఖాన నెఫ్రాలజీ డయాలసిస్ కేంద్రంలో 325 డయాలసిస్ చికిత్సలను విజయవంతంగా నిర్వహించగా, ఉస్మానియా డీమాట్ డయాలసిస్ కేంద్రంలో 14 చికిత్సలు చేశారు. ఉస్మానియా దవాఖానలో మొత్తంగా ప్రతి నెలా 1700 నుంచి 1800 మందికి డయాలసిస్‌ను నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles