డిసెంబర్ 7వ తేదీ ఎవరికి అనుకూలం!

Thu,October 11, 2018 05:25 PM

Prof Kanakadurgam Dantu clarification on who will in telangana Elections

కేసీఆర్ బలం రోజురోజుకి పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియక ఆంధ్ర మీడియా రకరకాలుగా ప్రజలని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అక్టోబర్ 8న ఓ టీవీ చానెల్‌లో నాలుగున్నరికి జ్యోతిష్య విశ్లేషణలో ఒక వాదన జరిగింది. విజయవాడ నుంచి ఒక పండితుడు డిసెంబర్ 7వ తేదీ కేసీఆర్‌కు అనుకూలం కాదనీ, చంద్రబాబుకి చాలా అనుకూలమని నిరూపించడానికి చాలా శ్రమించారు. ఆయన వాదనలో ఎంత సత్యముందో, అసలు ఎన్నికల రోజు ఈ నాయకులిద్దరికీ ఎలా ఉందో విశ్లేషించి చూద్దాం.

జ్యోతిష్యంలో ఫలితాలు రెండు రకాలుగా లెక్కకడుతారు. దశ - దిశ అంటారు. అంటే విశ్లేషించబడిన జాతకుడి జాతక చక్రం, ప్రస్తుత గోచారం, జాతక చక్రం లగ్నం నుంచి చూస్తే గోచారం చంద్రలగ్నం, అంటే రాశి నుంచి పరీక్షించాలి. ఈ రెండు రకాలుగా విశ్లేషిస్తూ గతంలో కూడా జాతకుడికి ఏఏ గ్రహాలు అనుకూల, ప్రతికూల ఫలితాలు ఇచ్చాయో గమనించాలి.

ఇక ఆ టీవీ చానెల్ వాదనలో విజయవాడ శర్మ గారు ఎన్నికల రోజు ఉన్న అమావాస్య కేసీఆర్‌కు పనికిరాదు. చంద్రబాబుకి లాభిస్తుంది అన్న మాటలో నిజం లేదు. కేసీఆర్, చంద్రబాబులవి లగ్నాలు ఒకటే! మేషలగ్న జాతకులైన వీరి రాశులు మాత్రం భిన్నం. ఇక డిసెంబర్ 7న ఇద్దరికీ గోచారం ఎలా ఉందో పరిశీలిద్దాం. ఆ రోజు జేష్ఠ్య నక్షత్రం. ఈ నక్షత్రం కేసీఆర్‌కు జన్మనక్షత్రం అవుతోంది. వారిది ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఇది వారికి నిషేకము, యాగము, చేలకర్మ, అన్నప్రాసన, వ్యవసాయ ఉపనయన, పట్టాభిషేక, భూ సంపాదన, అక్షరాభ్యాసములలో శుభకరం. అంటే ఆ రోజు కేసీఆర్‌కు తారాబలం బ్రహ్మాండంగా ఉంది.

చంద్రబాబుది కృత్తికా నక్షత్రం. జేష్ఠ్య వీరికి నైధన తార(7) అవుతుంది. పనికి రాదు. పంచాంగం ప్రకారం ఏడవ తార ఉన్న రోజు ఫలితాలు విరోధం, కలహం, వివాదాలు, పోటీలు, శత్రుభయం, ఒత్తిడి, వ్యతిరేకత, అవమానం, పరాజయం, వంచన, శోకం ఇత్యాది. అంటే డిసెంబర్ 7వ తేదీ కేసీఆర్‌కు ఎంతో అనుకూలమైతే చంద్రబాబుకు పూర్తిగా ప్రతికూలం.

డిసెంబర్ 7న రాశిచక్రంలో ఉన్న గ్రహల స్థితి ఎవరికి గోచారరీత్యా అనుకూలంగా ఉందో చూద్దాం. ఆ రోజు వృశ్చిక లగ్నంలో ఏర్పాట్లు పూర్తయి పోలింగ్ మొదలవుతుంది. రవి, బుధ, గురు, చంద్ర గ్రహాలు వృశ్చికంలో ఉండి రెండు మహా యోగాలు కలిగించాయి. బుధాదిత్య యోగం, గజకేసరి యోగం. ఈ వృశ్చిక రాశి కేసీఆర్ కర్కాటక రాశికి పంచమస్థానం. గురుచంద్రుల కలయిక వల్ల కలిగిన గజ కేసరి యోగం అధికారంలో ఉన్న నాయకుడికి లాభిస్తుంది. పైగా పంచమంలో ఉండి గురువు కర్కాటక రాశి మీద నవమ దృష్టి కలిగి ఉన్నాడు. ధనాధిపతి రవి పంచమంలో ధన కారకుడైన గురుడితో కలిసి ఉండడం కూడా కర్కాటక రాశికి లాభించే అంశం. గోచార రాశి నుంచి నవమంలో ఒంటరిగా ఉన్న రాహువు కేసీఆర్ ప్రభుత్వానికి అఖండంగా ఆయుష్షు ఇస్తాడు. వీరికి గోచారంలో శని జన్మరాశి నుంచి 6వ ఇంట్లో ఉన్నాడు. షష్ఠంలో శని శతృ సంహారకుడు. ఇక తులలో శుక్రుడు ఉండటం చాలా అదృష్టం. గోచార రాశి నుంచి 12లో ఉన్న శుక్రుడు శుభకరం. గ్రహాలన్నింటిలో వ్యయం(12)లో ఉండి కూడా యోగించేది ఒక్క శుక్ర గ్రహమే! కేసీఆర్ లగ్నాధిపతి కుజుడు గోచారంలో జన్మ లగ్నానికి లాభం(11)లో ఉన్నాడు. అంటే గోచార రీత్యా కేసీఆర్‌కు గురు, శుక్ర, బుధ, రవి, చంద్ర, కుజులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. రాహువు గురు వీక్షణతో బలపడితే మూడో ఇంట్లో కేతువు వారికి విక్రమ స్థానాన్ని బలోపేతం చేశాడు.

ఇక చంద్రబాబు గోచారం. వీరిది వృషభ రాశి. ఈ రాశికి గురుడు వృశ్చికంలో ప్రవేశించినప్పటి నుంచి (అక్టోబర్ 11) దుర్యోగం మొదలవుతుంది. 7వ స్థానంలో కేంద్రాధిపత్య పాపం పొందిన గురుడు, శత్రువులైన రవిచంద్రులు వృషభ రాశి మీద పూర్ణ దృష్టి కలిగి ఉన్నారు. బుధుడు మిత్రుడే అయిన శత్రు క్షేత్రమైన వృశ్చికంలో శత్రువులతో కలిసి నిస్సహాయుడిగా ఉన్నాడు. కాబట్టి గురు, బుధ, రవి, చంద్రులు చంద్రబాబుకు యోగించవు. ఇక వృషభ రాశ్యాధిపతి శుక్రుడు దుస్థానమైన 6వ ఇంట్లో ఉండి అశక్తుడయ్యాడు. రాశి నుంచి వ్యయాధిపతి కుజుడు రాజ్యం(పదో ఇల్లు)లో ఉండి అధికార వ్యయం చేస్తాడు. కానీ సహాయం చేయడు. ఇక రాహువు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల నిరాశే కానీ లాభం లేదు. 3వ ఇంట రాహువు సోదర సమానులని దూరం చేస్తే, 9వ ఇంట కేతువు భాగ్య స్థానాన్ని నిరాశపరుస్తాడు. గోచార రీత్యా ఈ రకంగా చూస్తే కర్కాటక రాశి వారికి యోగ్యంగా ఉంది కానీ ఎన్నికల తేదీ వృషభ రాశి వారికి లాభంగా లేదు.

ఇక ఇద్దరికీ ఇప్పుడు జరిగే దశలు విశ్లేషించినా ఇలాంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. చంద్రబాబు ఇప్పుడు జరుగుతున్న దశ శని మహాదశలో రాహు విదశలో శుక్ర అంతర్దశ. 2004లో చంద్రబాబు పార్టీ ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడు శని గోచార రీత్యా ద్వితీయంలో ఉండి అష్టమాన్ని(8ని) వీక్షిస్తున్నాడు. అందుకే కష్టాన్ని కలిగించాడు.

ఇక ఇప్పుడు అష్టమంలో(8లో) ఉండి ద్వితీయాన్ని(2ని) వీక్షిస్తున్నాడు. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు పార్టీ గెలిచే అవకాశమే లేదు. శని అష్టమంలో ఒక దుస్థానంలో ఉంటే రాహువు తృతీయంలోనూ, శుక్రుడు షష్ఠంలోనూ మిగతా రెండు దుస్థానాల్లో ఉన్నారు. శని కేతువు నక్షత్రమైన మూలలోనూ, రాహువు శని నక్షత్రమైన పుష్యమిలోనూ శుక్రుడు ద్వితీయంలో ఉన్న రాహువు నక్షత్రమైన స్వాతిలోనూ ఉన్నారు. నిరాశజనకమైన కేతువు భాగ్యస్థానంలోనూ(9లో)ఉండబట్టి ఫలితాలు నిరాశజనకంగానే ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్న దశానాధులైన శని, రాహు, శుక్ర గ్రహాలు మూడూ గోచార రీత్యా చంద్రబాబుకి ఓటమినే ఇస్తాయి.

ఇక కేసీఆర్‌కు రాహు మహాదశలో, శుక్ర విదశలో, చంద్ర అంతర్దశ జరుగుతోంది. రాజ్యం(10)లో ఉన్న రాహువు లగ్నాధిపతి అయిన కుజుడి నక్షత్రమైన చిత్తలో ఉండబట్టి 2014 జూన్‌లో అధికారం లభించింది. చంద్రబాబు నాయుడి లగ్నం కూడా మేషం కాబట్టి ఆయనకు 2014లో ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇక కేసీఆర్‌కు రాహువులో, బుధుడిలో ముఖ్యమంత్రి అవడానికి కారణం బుధుడు అప్పుడు రాహు నక్షత్రమైన ఆరుద్రలో ఉండడమే. ఇక డిసెంబర్ ఎన్నికల రోజున మహాదశానాధుడైన రాహువు పుష్యమి నక్షత్రంలోనూ, శుక్రుడు మళ్లీ రాహు నక్షత్రమైన స్వాతిలోనూ, చంద్రుడు బుధుడి నక్షత్రమైన జేష్ఠ్యలోనూ ఉండడం కేసీఆర్‌కు గోచారంలో అత్యంత అనుకూలం.

ఇద్దరూ నాయకుల మహాదశలు తీసుకున్న చంద్రబాబుకి రాజ్యాధిపతి శని శతృక్షేత్రంలో బలహీనపడితే, కేసీఆర్‌కు రాజ్యంలోని రాహు మకరంలో మిత్ర క్షేత్రంలో ఉండి బలపడి, ప్రభుత్వాధికారానికి కారకుడైన రవి నక్షత్రం(ఉత్తరాషాఢ)లో ఉన్నాడు. అంతే కాక రోహిణీ నక్షత్రంలో స్థితి చెందిన గురువీక్షణతో అధిక బలవంతుడయ్యాడు. అన్నింటికంటే మించి కేసీఆర్ లగ్నాధిపతి, గోచార రీత్యా రాశ్యాధిపతి అయిన కుజుడు లాభం(11వ ఇంట్లో)లో రాహు నక్షత్రమైన శతభిషంలో ఉండి ఫలితాన్ని శుభకరంగా మలుస్తున్నాడు. గోచారాన్ని బట్టి చూసినా, జాతకాన్ని బట్టి చూసినా కేసీఆర్‌కు రాజ్య రాహువు యొక్క దశ, మిగతా గ్రహాలు కూడా రాహు సంబంధం కలిగి, ముఖ్యంగా జన్మరాశిలో ఉన్న రాహువుకు, చంద్రుడికి గురువీక్షణ కలగడంతో ఈ డిసెంబర్‌లో ఎన్నికలు మామూలు గెలుపు కాకుండా అఖండ విజయాన్ని ఆయనకు ఇస్తాయనడంలో సందేహం ఏ మాత్రం లేదు.

ఏది ఏమైనా మనం మనకున్న కాస్త శాస్త్ర జ్ఞానంతో విశ్లేషణలు చేస్తాం. ఏం జరగాలి అన్నది ఎప్పుడో నిర్ణయమై ఉంటుంది. సామాన్య ప్రజలుగా మనమంతా అధికారాన్ని ఓటు ద్వారా రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడపగలిగే మేధస్సు, నడపాలనే చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని గెలిపించాలి. దశాబ్దాలుగా కుట్రలు, కుతంత్రాలు చేసి కూడా, ఇప్పుడు ప్రజలను వారి అలవికాని పథకాలతో మభ్యపెట్టాలని ప్రయత్నించే వారిని దూరం పెట్టాలి. ప్రజా క్షేమం కోరి ప్రతి వారు ఈ ఒక్క పని చేస్తే తెలంగాణ ఇంకా ప్రగతి సాధించే అవకాశం ఉంది.

ప్రొఫెసర్ కనకదుర్గ దంటు, 8977243484.

5522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS