ప్రవర్తన మార్చుకోని నేరస్తులపై పీడీ యాక్ట్

Mon,October 22, 2018 07:04 AM

Preventive Detention Act on convicts who do not change behavior

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీ నేరాలు పెరగకుండా కట్టడి చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు, మాదక ద్రవ్యాలు తదితర వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల మేరకు నగర ఆబ్కారీ అధికారులు రంగంలోకి దిగారు. ఎన్నికల సందర్భంగా ఆబ్కారీ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి తెలిపారు. ఎక్సైజ్ నేరాలను అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు.

ఇందుకు సంబంధించిన ప్రణాళికను జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ యూనిట్లతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలకు జారీ చేసినట్లు వివరించారు. ఎన్నికల నియమావళి నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్‌ను కూడా ఆదివారం నుంచి ప్రారంభించామన్నారు. ఈ డ్రైవ్‌లో తొలిరోజే 21కేసులు నమోదు చేసినట్లు డీసీ తెలిపారు. రాజకీయ సభలు, సమావేశాల్లో మద్యం సరఫరా చేయడం, ఓటర్లను మభ్యపెట్టే విధంగా ఉచిత మద్యం పంపిణీ, అక్రమ మద్యం నిల్వలు, నిబంధనలకు విరుద్ధంగా మద్యం కొనుగోలు, విక్రయాలు, బెల్టుషాపుల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం తదితర అన్ని రకాల ఆబ్కారీ నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీ వివేకానందరెడ్డి వివరించారు.

ఆబ్కారీ నేరాలపై నిరంతరం ఫిర్యాదు స్వీకరించేందుకు నగరంలోని ఆబ్కారీ భవన్(ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం)లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కంట్రోల్‌రూం 24 గంటలూ నిర్విరామంగా పనిచేస్తుందని దీనికి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి అనే అధికారి పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించనున్నట్లు వివరించారు. కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన సమాచారం లేదా ఫిర్యాదును వెంటనే సంబంధిత అధికారులకు, ఉన్నతాధికారులకు చేరవేస్తారన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే గంటలోపు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతమన్నారు.

పీడీ ప్రయోగానికి రంగం సిద్ధం


ఎన్ని కేసులు పెట్టినా ప్రవర్తన మార్చుకోకుండా ఎక్సైజ్ నేరాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు డీసీ వివేకానందరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘంతో పాటు రెవెన్యూ, ఆబ్కారీ ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఇక ప్రవర్తన మార్చుకోని పాత నేరస్థులపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు స్పష్టం చేశారు.

1118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS