నేడు హైదరాబాద్ ఐఐటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి

Sun,August 5, 2018 06:47 AM

President Ram Nath Kovind will deliver the Convocation Ceremony at the IIT-Hyderabad

సంగారెడ్డి రూరల్ :నూతన ఆవిష్కరణల్లో మేటిగా నిలిచిన హైదరాబాద్ ఐఐటీ 7వ స్నాతకోత్సవానికి ముస్తాబైంది. కంది మండల పరిధిలోని జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఐఐటీ దేశం చూపును తనవైపునకు తిప్పుకుంటున్నది. దేశంలోని ఐఐటీలలో పదోస్థానం దక్కించుకుని సత్తా చాటింది. ఆదివారం నిర్వహించనున్న సంబురాలకు దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఐఐటీ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌లో ఎన్నో విద్యాలయాలు నెలకొల్పి ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ ఐఐటీలో సాంకేతిక విద్యారంగంలో ఆరితేరిన విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు ఐఐటీ హైదరాబాద్‌పై దృష్టి సారించి కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు నూతన ఒరవడికి నాంది పలికారని సందర్శించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఐఐటీ 7వ స్నాతకోత్సవ సంబురాలను తిలకించేందుకు ఈనెల 5వ తేదీన హాజరుకానున్నారు. ఇందుకోసం కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో శుక్రవారం హెలీప్యాడ్‌ను పరిశీలించి హెలీకాప్టర్ ట్రయల్ రన్ చేశారు. అంతేకాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు జిల్లా పర్యవేక్షణలో పహారా కాస్తున్నారు. మెదడులో వచ్చిన ఆలోచలను అమలు చేస్తూ దేశాన్ని అబ్బురపరిచే విధంగా కొత్త రూపకల్పనలకు ఇక్కడి విద్యార్థులు పెట్టింది పేరు. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆవిష్కరణలను చేస్తూ ఉంటారు. మేథోశక్తి నిండుగా ఉన్న నిపుణులు, అధ్యాపకులు తమ వంతుపాత్రను పోషిస్తూ విద్యార్థులకు సహకరిస్తున్నారు.

కంది మండల పరిధిలోని జాతీయ రహదారికి కూతవేతవేటు దూరంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ ప్రతి ఒక్కరూ చూపులు తనవైపు తిప్పుకునే విధంగా చేస్తుంది. టెక్నాలజీనే ఆయుధంగా చేసుకుని సరికొత్త ఆవిష్కరణలకు రూపాలను అందించే విశ్వవిద్యాలయం అది. స్థాపించిన అనతికాలంలో దేశంలోని 29 ఐఐటీలో ఐఐటీ హైదరాబాద్ పదో స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందుతుంది. డైరెక్టర్ యూబి.దేశాయ్ నేతృత్వంలో ఐఐటీయన్లు ఇటు చదువుల్లో అటు నూతనావిష్కరణలో తమ సత్తాను చాటి దేశానికి ఆదర్శంగా నిలిస్తుంది. ఈ నెల 5న ఐఐటీ హైదరాబాద్ 7వ స్నాతకోత్సవ సంబురాన్ని జరుపుకోబోతుంది. ఈ స్నాతకోత్సవ సంబురాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరై తన అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు అందించనున్నారు.

ఐఐటీ హైదరాబాద్ ప్రస్థానం

కేంద్ర ప్రభుత్వం 2008లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు ఐఐటీల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఒకటి. కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే 570 ఎకరాల సువిశాల స్థలంలో క్యాంపస్‌ను అభివృద్ధి చేసుకుని 2017లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితాలో ఇంజినీరింగ్ రీసర్చ్, ట్రైనింగ్ ఇచ్చే విద్యా సంస్థల జాబితాల్లో ఐఐటీ హైదరాబాద్ 10వ ర్యాంక్ సాధించింది. స్థాపించిన అనతికాలంలో పదో స్థానంలో నిలిచిన ఘనత ఐఐటీ హైదరాబాద్‌కు దక్కింది. కాగా ఐఐటీ హైదరాబాద్‌లో 181 మంది పూర్తి సమయం అధ్యాపక బృందం ఉండగా, మొత్తం 2328 విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యాభాసం చేస్తున్నారు. ఐఐటీహెచ్‌లో 100కు పైగా అత్యాధునిక ల్యాబ్‌లు, 9 పరిశోధనా, ఆంత్రప్రన్యుషిప్ కేంద్రాలున్నాయి. అయితే ఐఐటీ హైదరాబాద్‌లో రీసర్చ్‌పై ప్రధాన దృష్టి పెట్టి ముందుకు సాగుతుంది. ఇందుకుగాను ఏకంగా రూ.250 కోట్లను ఇప్పటి వరకు కేటాయించడం విశేషం. కాగా ఈ క్యాంపస్‌లో చదివే విద్యార్థుల్లో 30 శాతం మంది పీహెచ్‌డీ స్కాలర్ కలిగి ఉన్నవారున్నారు. అయితే ఇప్పటి వరకు 1500 పరిశోధనా ప్రచురణలు, పేటెంట్ డిస్లోజర్లు, 300 స్పాన్సర్డ్, కన్సల్టెన్సీ ప్రాజెక్టులు, 50 పారిశ్రామిక సహకారాలతో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధనా రంగంలో, నూతన ఆవిష్కరణల్లో అందరికంటే ముందుడడం మరో విశేషం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, యూరోప్ దేశాల్లోని 50 విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు ఐఐటీహెచ్ కుదుర్చుకుంది. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రాథమిక విజ్ఞానశాస్త్రం, ఆధునిక కళలు, ఫొటోగ్రఫీ, థియేటర్, పెయింటింగ్ వంటి సృజనాత్మక కళలను ప్రోత్సహించే విధంగా తన నమూనా విద్యాబోధనా కార్యక్రమాలను రూపొందించడంతో అన్ని విద్యా సంస్థలకు ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శిగా నిలుస్తోంది.

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles