ప్రజా రక్షణ కోసం పోలీసులు ప్రాణత్యాగానికైనా సిద్దం: ఎస్పీ

Wed,October 16, 2019 05:12 PM

నిర్మల్: శాంతి భద్రతలు, ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణత్యాగాలకైనా సిద్దంగా వుంటారని జిల్లా ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 వరకు నిర్మల్ జిల్లా పరిధిలో నిర్వహించే పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా జిల్లా పోలీస్‌ కార్యాలయములో పోలీస్‌ ఓపెన్‌ హౌజ్‌ను నిర్వహించారు. ఈ ఓపెన్‌ హౌజ్‌లో పోలీసులు విధినిర్వహణలో ఉపయోగించే ఆయుధాలతో పాటు బాంబ్‌ డిస్పోజల్‌, క్లూస్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, డాగ్‌స్క్వాడ్‌, కమ్యూనికేషన్‌, పోలీస్‌ టెక్నాలజీకి సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పోలీస్‌ అధికారులు విధినిర్వహణలో వినియోగించే ఆయుధాల పనితీరును పాఠశాల విద్యార్థులకు వివరించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ కోసం పోలీస్‌ విభాగం ఏర్పాటయిందని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లాలో శాంతి-భద్రతల పరిరక్షణ కోసం 20మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారనీ, వారి త్యాగాల ఫలితంగానే నేడు జిల్లా ప్రజలు స్వేచ్చగా జీవిస్తున్నారని ఎస్పీ అన్నారు. ప్రజలకు సేవలందించడం పోలీసుల విధి అనీ, ప్రతినిత్యం ప్రజాసేవలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులకు సూచించారు. పోలీసులు నిర్వర్తించే విధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ఓపెన్‌ హౌజ్‌లను ఏర్పాటు చేసామని ఎస్పీ తెలియజేశారు.

ఈ కార్యక్రమములో అదనపుఎస్పీలు దక్షిణామూర్తి, వెంకట్ రెడ్డి, నిర్మల్ పట్టణ సి.ఐ. దివాకర్, RIలు వెంకటి, క్రిష్ణాంజనేయులు, MTO వినోద్, RSIలు మరియు ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles