కవి, గాయకుడు దేవరకొండ బిక్షపతి కన్నుమూత

Fri,September 4, 2015 03:08 PM

Poet and singer DEVARAKONDA BIKSHAPATHI passes away

హైదరాబాద్: కవి, గాయకుడు దేవరకొండ బిక్షపతి నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చేందుకు, సమాజాన్ని మేల్కొల్పేందుకు బిక్షపతి అనేక పాటలు రాసి పాడారు.

Poet and singer DEVARAKONDA BIKSHAPATHI passes away

నిన్ను విడిచి ఉండలేనమ్మా ...ఓ పాటమ్మ ఎన్నడూ మరచిపోనమ్మా ...నా పాటమ్మ ప్రతి మదిలోన మెదులుతుంటవో పాటమ్మ నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మ అంటూ పాటపైనే పాట రాసి తెలంగాణ ఉద్యమ ధూంధాం పాల్గొన్న ప్రతీ కార్యక్రమంలో పాడి వినిపించారు.


ఓ పాటమ్మ
నిన్ను విడిచి వుండలేనమ్మా
నిన్ను విడిచి వుండలేనమ్మా... ఓ పాటమ్మ
ఎన్నడూ మరిచిపోనమ్మో... నా పాటమ్మ
ప్రతి మదిలోన మెదులుతు వుంటవో పాటమ్మ
నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మ
॥ నిన్ను ॥

ఉద్యమానికి ఊపిరూదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు
ఊరె సెలిమలాగ గోరేటి వెంకన్న చేతివెంట రాలుతుంటవు
ఊరూరా దొరలకు ఎదురు దిరగమన్నందుకే ఓ పాటమ్మ
జయరాజన్న వెంట జైలుకువోయీ జంగ్ సైరనూదినావమ్మ
॥ నిన్ను ॥

వంగపండూ ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవు
గూడ అంజన్నకు తోడు నీడగుంటు ఊరువాడ మనదంటావు
అందెశ్రీ వొంటినిండ అలుముకొని ఓ పాటమ్మ
వరంగల్లు శీనన్న వెంట బెట్టుకొని పల్లెచుట్టు వస్తవో ఓ పాటమ్మ
॥ నిన్ను ॥

ప్రేమ ప్రేమకు మధ్య పెద్దమనిషివై ఇద్దరినీ కలుపుతావమ్మ
యుద్ధంలో ఒరిగిన వీరుల్ని ముద్దాడే దాక నిద్దురా పోవమ్మ
అమరవీరుల అమ్మ నాన్నలకు నువ్వు ఓ పాటమ్మ
కన్నబిడ్డల కండ్ల ముందు చూపిస్తావు వెన్నెలైనా మళ్ళి బతికిస్తు

ఉంటావు
॥ నిన్ను ॥

పరదేశీ వాళ్ళ నోటిలోన నువ్వు పడరాని పాట్లు పడుతుంటవు
స్వదేశి స్వార్థాన్ని అర్థం చేసుకొని మెదులుతుంటవు
ఒకడు రాసి ఇంకొకడు పేరు మోస్తే ఓ పాటమ్మ
కనులారా జూసి ఏమి జేయలేక కుమిలి కుమిలి పోతవోయమ్మ
॥ నిన్ను ॥

దండకారణ్యంలో దండు నడిపేటోళ్ళతోని అండగా ఉంటవు
దళంలోకి కొత్త తమ్ముళ్ళను చేరదీయడంలో ముందుంటవు
ఒరిగిన అమరవీరుల ఆశయాలు ఒక్కొక్కటీ గుర్తు చేస్తావో
దండిగా పోరు జేయమని గుండె ధైర్యాన్ని నూరిపోస్తవో
॥ నిన్ను ॥

నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళూ కొందరు అసలు
కళాకారులై పుట్టనందుకు కుమిలి పోయేవాళ్ళు ఎందరో
ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను
బతిమిలాడు కుంటాడోయమ్మ
నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా
॥ నిన్ను ॥

తొలకరొచ్చి రైతు అరక దున్నే కాడ చేరదీర చెలిమి చేస్తావో
పంట రాసి పోసి కుండ కొలిచే కాడ రైతు నోట రాగమైతవు
పంటనంత బండిమీద కెత్తినంక ఎడ్లమెడలో గంటవైతవో
గిట్టుబాటు ధరకు కొట్లాడమని కోటి గొంతులల్ల ఒక్కటైతవో
॥ నిన్ను ॥

సత్యం గల్ల మా సమ్మక్క సారక్క తల్లులని అంటవు మహిమగల్ల
మా దేవుడూ ఎములాడ రాజన్నంటావు
అల్లా, ఏసు, కొమిరెల్లి మల్లన్న కోటి దేవతలెందరో
నీ కూత చెవున పడకపోతే బయటకు రానని మొండికేస్తరో
॥ నిన్ను ॥

దొంగ సర్కారుకు వంగి బతకద్దని సంఘాలెన్నోవెట్టి వస్తవు
అన్యాయాన్ని ఎదిరించే అన్నలకు అండదండగా ఉంటవు
పోరు జెయ్యకుంటే బతుకు మారదన్నందుకే ఓ పాటమ్మ
కడుపులోన ఎన్ని తూటాలు వడ్డా కలత చెందని మనసు నీదమ్మ
॥ నిన్ను ॥

అమ్మనాన్నల సంపాదనేమి లేదు తాత తండ్రుల నాటి
ఆస్తుపాస్తులు లేవు.
కడుపు మాడ్చుకొని కన్నవాళ్ళనిడిసి ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తము
నిన్ను నమ్ముకొనే బతుకుతున్నము ఓ పాటమ్మ
ఉన్ననాడు కల్సి తింటము లేకుంటే నిన్ను తలుసుకుంటము
॥ నిన్ను ॥

సుద్దాల హన్మంతును ముద్దాడి బుద్ధి మాటలెన్నో జెప్పినవు
సుబ్బారావు పాణిగ్రాహి చేతిలోన జమిడిక మోతై మోగినవు
చిందు ఎల్లమ్మతో ముందు నడిచి మా పల్లెల్ని కలియ తిరిగినవు
శంకరన్న సారంగపాణిలతో కడదాక కలిసి నడిచినవు
॥ నిన్ను ॥

వెలివాడల పురుడు పోసుకొని పల్లె తల్లి కడుపు పంటవైతవు
తెలంగాణకు తోబుట్టువైతవు అందరికీ ఆడబిడ్డవైతవు
ఏ తల్లి ఈ జన్మనిచ్చిందోగానీ ఓ పాటమ్మా
పదికాలాల పాటు సల్ల గుండాలే నా తల్లి నీకు వందనాలమ్మ
॥ నిన్ను ॥

5002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS