ఇక్కడే సెటిలయ్యాం..

Mon,June 20, 2016 07:37 AM

plemingos batch at ameenpur cheruvu


గుజరాత్ తీరంలో సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ శీతాకాలంలో తూర్పు భారత సముద్ర తీర ప్రాంతాల్లో విడిదిచేసే ఫ్లెమింగోలు నగరంలో శాశ్వత ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కనువిందు చేస్తున్నాయి. ఆకాశంలో అరుదైన రాజహంసల విన్యాసాలు అమీన్‌పూర్ చెరువు సమీపంలో ప్రతిరోజూ అలరిస్తున్నాయి. సుదూరమైన వలస సందర్భంలో కొన్నిరోజులు మాత్రమే కనిపించే రాజహంసలు ఏడాదంతా ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నాయి. సముద్ర తీర వాతావరణంలో జీవించేందుకు అనువైన ఈ ఫ్లెమింగోలు (రాజహంసలు) నివసించేందుకు అనువైన ప్రదేశంగా ఉండడంతో ప్రభుత్వం అమీన్‌పూర్ చెరువుని జీవవైవిధ్య వారసత్వం గా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

రాజహంసలు ఉత్తర భారతదేశంలో దక్షిణతీరం వెంబడి ఉం టాయి. వేలసంఖ్యలో ఉండే ఈ పక్షులు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షన. వేగంగా నీళ్లలో నడవడంలోనూ.. సుదీర్ఘంగా ఎగరడంలోనూ ఆరితేరిన ఈ పక్షుల గుంపుల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ ముచ్చటగొలిపే పక్షులు ఉత్తర భారతంలోని చలిని తట్టుకోలేక దక్షిణ భారతదేశానికి ఏటా వలస వస్తుంటాయి. తూర్పుతీరంలోని పాయింట్ కాలినీర్ ప్రాంతానికి చేరుకుంటాయి.

చెన్నైకి సమీపంలో సుదూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సుదీర్ఘకాలం ప్రయాణించాల్సిందే. ఆ శక్తిని కూడగట్టుకునేందకు అవి వలస ప్రారంభించిన కొన్నిరోజుల తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో విడిది చేస్తాయి. వారం నుంచి పదిరోజులపాటు నగర సమీపంలోని నీటి ఆవాసాల వద్ద ఉండి కొంత శక్తిని కూడగట్టుకుంటాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి పులికాట్‌కు చేరుకుంటాయి. వాటిలో కొన్ని శీతాకాలం ముగిసే వరకు పులికాట్‌లోనే నివాసం ఉంటాయి. మరికొన్ని రాజహంసలు పులికాట్ నుంచి పాయింట్ కాలినీర్‌కు చేరుకుంటాయి. ఏప్రిల్ మధ్యలో వాతావరణ పరిస్థితులు మారడంతో గుజరాత్ తీరప్రాంతానికి వలసపోతాయి. ఏటా జరిగే ఈ వలసలో ఫ్లెమింగోలు హైదరాబాద్ పరిసరాల్లో పదిరోజు ల వరకు కనువిందు చేస్తాయని భావించేవాళ్లు. కానీ హైదరాబాద్‌లోని బర్డ్ వాచర్స్ ఏటా నిర్వహించే పరిశీలనలో ఇవి ఏడాది పొడవునా ఉండటాన్ని గుర్తించారు. ఆ సంస్థ నాలుగేళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఫ్లెమింగోలు ఉంటున్నట్లుగా గుర్తించారు.

వైవిధ్య ఆవాసాలు..
నగరానికి సమీపంలోని పరిసరాల్లో ఉంటున్న ఫ్లెమింగోలు ఏళ్లతరబడి ఉండటాన్ని గుర్తించిన జీవ శాస్త్రవేత్తలు ఫ్లెమింగోల నివాసానికి హైదరాబాద్ వాతావరణంతోపాటు, స్థానిక పరిసరాలు కూడా అనుకూలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషిస్తున్నారు. పటాన్‌చెరు మండలంలోని అమీన్‌పూర్ చెరువలో రాత్రివేళల్లో, ఉదయం వేళ ఉంటున్నట్లుగా అధ్యయనంలో తేలింది. ఈ చెరువులో అవి స్థిరంగా ఉండడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు, జీవవైవిధ్య పరిశోధకుడు ప్రొఫసర్ శ్రీనివాస్ చెలమల పేర్కొంటున్నారు. ఫ్లెమింగోలకు కావాల్సిన ఆహారం దొరికే ప్రదేశాలు అమీన్‌పుర్ కేంద్రం గా వందకిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్నాయని ఆయన చెబుతున్నారు. మంజీరా, సింగూరు నీటివనరులు అందుబాటులో ఉన్నాయని, వీటిల్లో ఫ్లెమింగోలకు ఆహారమైన ప్లాంక్టన్స్ (సూక్ష్మజీవులు) విరివిగా లభిస్తున్నాయని విశ్లేషిస్తున్నారాయన. దీనితోపాటు అమీన్‌పూర్ చెరువు పరిసరాల్లో వాహనాలు, పరిశ్రమల రొద లేకపోవడంతో అవి ఇక్కడ స్థిరంగా ఉంటున్నాయని శ్రీనివాస్ నమస్తే తెలంగాణతో అన్నారు.

జీవ వైవిధ్య వారసత్వం!
ఏడాది పొడువునా ఫ్లెమింగోలు ఉంటుండటంతో అమీన్‌పూర్ చెరువు నగరవాసులనే కాకుండా ఇతర ప్రాంతాల పర్యాటకులను, జంతు ప్రేమికులను ఆకట్టుకుంటోంది. చెరువులో ఫ్లెమింగోలతోపాటు ఇతర పక్షులు కూడా ఆవాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాయి. యాత్రికులను ఆకట్టుకుంటున్న ఈ జీవ వైవిధ్యాన్ని గుర్తించిన పర్యాటక సంస్థలు ఇటీవల టూరిజం ప్యాకేజీల్లో అమీన్‌పూర్ లేక్‌ని కూడా పర్యాటక ప్రదేశాల జాబితాలో చేర్చాయి. అరుదైన జీవులకు ఆవాసంగా ఉన్న అమీన్‌పూర్ చెరువుని జీవవైవిధ్య వారసత్వంగా గుర్తించి పరిరక్షించడం ద్వారా ఈ జీవవైవిధ్యాన్ని కాపాడాలని పర్యావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జీవవైవిధ్య మండలి ఈ విషయంపై దృష్టి సారించింది. అమీన్‌పూర్ చెరువుని జీవవైవిధ్య వారసత్వంగా ప్రకటించేందుకు గెజిట్ విడుదలకు ఆ సంస్థ కృషి చేస్తోంది. అసాధారణ రాజపత్రం విడుదల చేసేందుకు ముందుగా స్థానికుల నుంచి, పరిశోధకులు, పర్యావరణ ప్రేమికుల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అన్నీ సజావుగా సాగితే అమీన్‌పూర్ చెరువులోని జీవ వైవిధ్యం శాశ్వతంగా నిలిచి, కనువిందు చేసే పక్షులతో అలరారుతూ ఉంటుంది.

1894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles