దేవాదుల ద్వారా పెంబర్తి చెరువు నింపుతాం : కడియం

Fri,August 10, 2018 01:41 PM

Pembarthi pond will be filled with devadula water says Kadiyam

జనగామ : జిల్లాలోని పెంబర్తిలో రైతులకు రైతుబంధు జీవిత బీమా పత్రాలను డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు వచ్చేది తెలువకుండా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చిన ఈ నాలుగేళ్లలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ నిరంతరంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. కరెంట్ కష్టాల నుంచి బయటపడ్డామని కడియం తెలిపారు.15 రోజుల్లో దేవాదుల ప్రాజెక్టు ద్వారా పెంబర్తి చెరువు నింపి సాగు కష్టాలు కూడా తీరుస్తాం. గతంలో ఎన్నడూ నిండని పెంబర్తి చెరువు కేసీఆర్ పాలనలో నిండింది. ఈసారి మళ్ళీ చెరువు నింపి ఈ గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటాం.

ఇప్పటికే ఈ గ్రామానికి 90 లక్షల రూపాయల సీసీ రోడ్లు, పాఠశాలకు4 అదనపు గదులు, మహిళా కమ్యూనిటీ హాల్ ఇచ్చాము. ఇప్పుడు సాధారణ కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మిల్క్ సెంటర్ మంజూరు చేస్తున్నామని తెలిపారు. సాధారణ కమ్యూనిటీ హాల్ కి 20 లక్షలు మంజూరు చేస్తున్నాను. గతంలో ఎండాకాలం వచ్చిందంటే ట్రాక్టర్ల ద్వారా తాగునీళ్లు తెచ్చుకునేవాళ్ళం. మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడు తాగునీటి కష్టాలు తీర్చుకున్నామని పేర్కొన్నారు. 4 సంవత్సరాలలో కరెంట్, తాగునీరు సమస్య తీర్చుకున్నాం.

పేదింట్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దని ఇప్పుడు 1,00,116 రూపాయలు కల్యాణ లక్ష్మీ కింద ఇస్తున్నాం. గర్భం దాల్చిన ఆడపిల్ల ఆ సమయంలో కూలికి వెళ్లకుండా ప్రసవానికి 3 నెలల ముందు, ప్రసవం తర్వాత 3 నెల్ల వరకు నెలకు 2000 చొప్పున6 నెలలకు 12వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
గర్భం దాల్చిన సమయంలో నొప్పులు వస్తే అంబులెన్స్ వాహనంలో దవాఖానకు తీసుకెళ్లి, మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత 17 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ సూట్ కేస్ ఇచ్చి మళ్ళీ అదే వాహనంలో ఇంటి దగ్గర దింపుతున్న ప్రభుత్వం దేశంలో ఇంకా ఎక్కడైనా ఉందా ఆలోచించాలి. ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ కేసీఆర్ పాలనలో దేశంలో నెంబర్ వన్ అనిపించుకుంటున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు.

951
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS