పాలేరు పాత కాలువ ట్రయల్ రన్ సక్సెస్

Sat,August 12, 2017 09:28 PM

paleru old canal trail run success

ఖమ్మం : పాలేరు పాత కాలువకు ట్రయల్ రన్ విజయవంతమైంది. నైజాం రాజులు నిర్మాణం చేసిన పాలేరు పాత కాలువ శిథిలావస్థకు చేరగా తెలంగాణ ప్రభుత్వం రూ.68 కోట్ల నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఫిబ్రవరి 16న భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పాత కాలువ లైనింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా, జూలై 31న పనులు పూర్తి కావడంతో ఎన్‌ఎస్‌పీ అధికారులు శనివారం ట్రయల్ రన్ నిర్వహించారు.

శనివారం సాయంత్రం 4గంటలకు ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ సాయిబాబా, ఈఈ వెంకటేశ్వర్లు, సీడీసీ, ఆత్మ, మార్కెట్ కమిటీ చైర్మన్లు ట్రయల్ రన్ సందర్భంగా పాలేరు పాత కాలువ వద్ద పూజలు చేశారు. అనంతరం గేట్లు ఎత్తి ట్రయల్ రన్ ప్రారంభించారు. ముందుగా 50 క్యూసెక్కులు, 10నిమిషాల అనంతరం 100 క్యూసెక్కులు, 20 నిమిషాల అనంతరం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో రైతులు, నాయకులు, ప్రజాప్రతినిధులు సంబురాలు చేసుకున్నారు. పాలేరు జలాశయంలోని కృష్ణమ్మ జలాలు పాలేరు పాత కాలువలో పరవళ్లు తొక్కాయి. సాయంత్రం 4గంటలకు 0 పాయింట్ వద్ద నీటిని విడుదల చేయగా, రాత్రి 7గంటల సమయానికి 23.5కిలోమీటర్ల దూరంలోని చివరి ప్రాంతమైన నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చేరుకున్నాయి. అయితే చివారు వరకు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకపోవడంతో ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ అయినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ సాయిబాబా విలేకర్లతో మాట్లాడారు. ఎన్‌ఎస్‌పీ చరిత్రలో ఆరు నెలల వ్యవధిలో కోట్లాది రూపాయల ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం ఓ చరిత్ర అని అన్నారు. ఫిబ్రవరి 16న మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేయగా, జూలై 31నాటికి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. పాలేరు పాత కాలువ నిర్మాణం విషయంలో అధికారులు అద్భుతంగా పనిచేశారని, దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ నాణ్యత విషయంలో రాజీ లేకుండా కాలువను నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అందుకే ట్రయల్ రన్ మొదటి రోజే సక్సెస్ అయ్యామని అన్నారు. అందుకు సిబ్బందిని అభినందించారు. అలాగే పాలేరు పాత కాలువ లైనింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసే విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ సాధారణమైంది కాదని, ఆయన ప్రతి రోజు కాలువ నిర్మాణ పనుల విషయంపై చర్చించేవారని అన్నారు. ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఘనత మంత్రి తుమ్మలకి, ఎన్‌ఎస్‌పీ అధికారులకు దక్కిందన్నారు.

1888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles