కొన్నె గుట్టపై శిలాయుగం ఆనవాళ్లు.. ఆదిమానవుల అవశేషాలు వెలుగులోకి!

Mon,May 21, 2018 10:02 PM

Paleolithic Age indications found in konnegutta in jangaon district

జనగామ: కొన్నె గుట్ట పరిసర ప్రాంతాల్లో శిలాయుగం నాటి ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి. నాడు ఆదిమానవుల వినియోగించిన వస్తువులు, వారి అవశేషాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా ప్రొఫెసర్ పుల్లారావు నేతృత్వంలో చేపట్టిన తవ్వకాల్లో పురాతన వస్తువులు వెలుగు చూస్తున్నాయని తెలంగాణ వారసత్వశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎన్.ఆర్ విశాలాక్షి అన్నారు. జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని కొన్నె గుట్ట పరిసర ప్రాంతంలో ప్రొఫెసర్ పుల్లారావు నేతృత్వంలో జరుగుతున్న తవ్వకాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లారావుతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.

వేల ఏళ్లనాటి వారసత్వ సంపద, ఆదిమానవుల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ సహకారంతో హెచ్‌సీయూ ప్రొఫెసర్ కే పుల్లారావు ఆధ్వర్యంలో వివిధ యూనివర్సిటీల విద్యార్థుల బృందం ఈ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగస్తోందని తెలిపారు. బృహత్‌శిలాయుగం నాటి మానవుల సంసృతి, సంప్రదాయాలు, జీవనవిధానం ఎలా ఉండేదో ఈ తవ్వకాలు పూర్తయిన తర్వాత వెల్లడవుతుందన్నారు.

వేల ఏళ్లనాటి వారసత్వ సంపదను తరతరాలకు తెలియజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోందని విశాలక్ష్మి అన్నారు. కొన్నెగుట్ట కిందిభాగంలో జరిపిన తవ్వకాల్లో ఆదిమానవులు వాడిన కుండలు, పెంకులు, మట్టిపాత్రలు, వ్యవసాయానికి ఉపయోగించిన పనిముట్లు బయటపడ్డాయని తెలిపారు. ఆదిమానవుడు మరణిస్తే గోతులు తీసి అందులో పూడ్చి పెట్టారని రాకాసిగూళ్ల తవ్వకాల్లో బయటపడిందని అన్నారు.

నాటి ఆనవాళ్లు నేడు కళ్లకు కట్టినట్లుగా వెలుగు చూస్తున్నాయని ఆమె వివరించారు. రాకాసి సమాధుల్లో మరణించిన వారి కోసం కుండల్లో ఆహారం, ధాన్యం గింజలు వంటివి పోసి పాతిన సంసృతి వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఆదిమానవులు ఆహారంగా ఉపయోగించిన జంతువుల ఎముకలు బయటపడ్డాయని అన్నారు. వీటితోపాటు శ్రీలంకకు చెందిన పూసలు ఈ ప్రాంతంలో లభ్యమయ్యాయని అన్నారు. తవ్వకాల్లో వెలుగు చూస్తున్న రేఖా చిత్రాల ఆధారంగా బృహత్‌శిలాయుగం నాటి ఆనవాళ్లుగా గుర్తిస్తున్నామని ఆమె చెప్పారు. ఇంత సూక్ష్మ స్థాయిలో తవ్వకాలు జరపడం, వాటిని పరీక్షలకు పంపించడం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి అని పుల్లారావు వెల్లడించారు.

దాదాపు 50 రకాల షాంపిల్స్ సేకరించి లండన్ యూనివర్సిటీకి పంపిస్తామని ఆయన తెలిపారు. మట్టితో పాటు మట్టిని నీటిలో కలిపి అందులో నీటిపై తేలే వృష సంబంధమైన అవశేషాలను కనుక్కొనే వీలుందన్నారు. అతి సూక్ష్మమైన పూలపుప్పొడిని సేకరించామని అన్నారు. భూమిలో తవ్వకాలు జరిపేందుకు సహకారం అందిస్తున్న రైతులు చంద్రయ్య, పరశురాములకు ఆయన కృతజతలు తెలిపారు. అనంతరం గ్రామంలో లండన్ యూనివర్సిటి పరిశోధకురాలు డాక్టర్ ఎల్లెనార్‌కింగ్‌వెల్ బెన్‌హమ్, వారసత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు( టెక్నికల్) నాగలక్ష్మి గంగాదేవి, కేర్‌టేకర్ రాజేందర్, పరిశోధన బృందం అసిస్టెంట్ ప్రొఫెసర్ రఘు పర్యటించారు. వారి వెంట రాంబ్రహ్మం, స్కాలర్లు నారాయణ, శ్రీలక్ష్మి, ప్రవీన్‌రాజు, సుధాకర్, సూర్యనారాయణ, భాస్కర్, మానస ఉన్నారు.

4325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles