ఇకపై ఓయూ దూరవిద్య అడ్మిషన్లన్నీ ఆన్‌లైన్‌లోనే

Sat,August 12, 2017 07:49 PM

OU Distance admissions in online

హైదరాబాద్ : ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ)లోని అన్ని కోర్సుల ప్రవేశాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే జరుగనున్నాయి. దీనికి సంబంధించిన పోర్టల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శిరందాస్ రామచంద్రం, సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ చింత గణేష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి అన్ని అడ్మిషన్లు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు. ఈ దిశగా గత రెండేళ్ల నుంచి శ్రమిస్తున్నామని, ఈ ఏడాది నుంచి పూర్తిగా ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. విద్యార్థి రిజిస్ట్రేషన్ నుంచి అడ్మిషన్లు, పరీక్షా ఫీజు చెల్లించడం, ఇతర కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తామని అన్నారు. పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా వివిధ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని కోర్సులకు ఈ నెల 16వ తేదీ నుంచి ఆన్‌లైన్ ప్రవేశాలు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఊరూరా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఇక గ్రామాల నుంచి సైతం విద్యార్థులు నేరుగా తమకు నచ్చిన కోర్సుల్లో చేరవచ్చని వివరించారు.

అయితే ప్రవేశ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది మాత్రం ఒకసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పీజీఆర్‌ఆర్‌సీడీఈ కార్యాలయానికి రావలసి ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను సైతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సెంటర్లలోనే చేపడతామని చెప్పారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా విద్యావిషయ ప్రణాళిక, పరీక్షా ఫీజు చెల్లింపు, పరీక్షా తేదీల వివరాలు, ఈ - లర్నింగ్ మెటీరియల్ తదితర అన్ని అంశాలను సులువుగా విద్యార్థులకు చేరవేయవచ్చని అభిప్రాయపడ్డారు. అధ్యాపకులను ఈ మెయిల్స్ ద్వారా సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఆన్‌లైన్ విధానం ద్వారా ఎక్కువ మంది దూరవిద్య ద్వారా చదువుకునేందుకు ఆసక్తి చూపుతారని అన్నారు. భవిష్యత్తులో దూరవిద్య ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దూరవిద్యలో కూడా సీబీసీఎస్, సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టేందుకు త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఆ దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అనుమతులు లేని కోర్సులను నిలిపివేశామని, వాటికి తిరిగి అనుమతులు పొందేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పీజీఆర్‌ఆర్‌సీడీఈ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శివరాజ్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రావు, సీడీఈ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌ఆర్ గిరిధర్, పీఆర్‌వో డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

1391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles