ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం

Thu,June 13, 2019 08:32 AM

Osmania University 80th Convocation on June 17

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆరేండ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 79వ స్నాతకోత్సవాన్ని 2013 ఫిబ్రవరి 7న నిర్వహించినప్పటి నుంచి వివిధ కారణాల రీత్యా తదుపరి స్నాతకోత్సవాన్ని నిర్వహించలేకపోయారు. శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుక ఈ నెల 17న ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభంకానున్నది.

ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్య అతిథిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్, ఓయూ రసాయన శాస్త్ర పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో 2012 జూలై నుంచి 2018 జూన్ వరకు వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో స్వర్ణ పతకాలు, ఈ ఏడాది జూన్ 11వ తేదీ వరకు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఈ వేడుకల్లో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం వర్సిటీ నివేదికను సమర్పిస్తారు. అనంతరం గవర్నర్, ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని అధికారులు తెలిపారు.

గుర్తింపు కార్డులు తప్పనిసరి


స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు సాధించిన అభ్యర్థులు ఈ నెల 15న ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించి గుర్తింపు కార్డులు, ఆహ్వాన పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. పట్టాలు పొందే ప్రతి ఒక్కరూ విధిగా తెలుపు దుస్తులు ధరించాలని చెప్పారు. స్నాతకోత్సవ సాంప్రదాయం ప్రకారం అలా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని, గుర్తింపు కార్డులు వెంట కచ్చితంగా తెచ్చుకోవాలని తెలిపారు.

ఓయూ స్నాతకోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకం


ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం 80వ స్నాతకోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్నాతకోత్సవంలో పతకాలు, పట్టాలు పొందడాన్ని విద్యార్థులు ఎంతో గొప్పగా భావిస్తారు. ఈ స్నాతకోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం లేదు. చివరిసారిగా 79వ స్నాతకోత్సవాన్ని 2012 ఫిబ్రవరి 7న నిర్వహించారు. గత స్నాతకోత్సవంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ ఎల్.పాండురంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా డీటీవో పుప్పాల శ్రీనివాస్ వంటి ప్రముఖులు పట్టాలు పొందారు. ప్రస్తుతం జరుగనున్న వేడుకల్లో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పట్టాలు అందుకోనున్నారు.

లైవ్‌లో చూసేందుకు అవకాశం


స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు పాస్‌లు తప్పనిసరి కావడంతో దానిని చూడాలని భావిస్తున్నవారికి అధికారులు తీపికబురు అందించారు. చరిత్రలో తొలిసారిగా వేడుకను లైవ్‌లో తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని లైవ్‌లో వీక్షించేందుకు http://ou80thconvocation.live.streams9.in లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. స్నాతకోత్సవానికి సంబంధించిన లైవ్ ఫుటేజీ అవసరమైన వారు దూరదర్శన్ సంస్థను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

700 పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం


స్నాతకోత్సవంలో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూజీ, పీజీ, పీహెచ్‌డీలలో స్వర్ణ పతకాలు సాధించిన 292 మందికి వాటిని ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు 700లకు పైగా ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు అందించనున్నారు. సంబంధిత కాలవ్యవధిలో 2,896 మంది తమ పీహెచ్‌డీని పూర్తి చేసినప్పటికీ, వారిలో 1800 మంది ఇప్పటికే తమ పట్టాలు స్వీకరించారు. మిగిలిన వారు పట్టాలు స్వీకరించేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి స్పందించి దాదాపు 700 మంది దరఖాస్తు చేసుకున్నారు.

411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles