బ్రెయిన్‌డెడ్ యువకుని అవయవ దానం

Sat,January 12, 2019 09:49 PM

organ donated the brain dead young man

ముదిగొండ : తన భర్త అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిల్చింది ఓ మహిళ. వివరాల్లోకెళ్లే.. ఖమ్మంజిల్లా ముదిగొండ మండలంలోని యడవల్లి గ్రామానికి చెందిన కూరపాటి నర్సింహారావు(37) ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు చెందిన ఒక వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. తన విధుల్లో భాగంగా ఈనెల 10న ద్విచక్రవాహనంపై గార్ల వెళ్లి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం సంభవించింది. బైక్ మీద నుండి పడి తలకు కన్పించని గాయమైంది. వెంటనే కోమాలోకి వెళ్లిన నర్సింహారావును ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి బ్రెయిన్ డెడ్ అయినదని బతకటం కష్టమని తేల్చిచెప్పారు.

దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారే చీకటి అలుముకుంది. కుటుంబానికి పెద్ద దిక్కు ఇక బతకడనే విషయం తెలిసి గుండెలవిసేలా రోదించారు. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకుందామని చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అవయవ దానం చేస్తే మరో నలుగురికి ప్రాణం దక్కుతుందని డాక్టర్లు చెప్పడంతో భార్య రాజేశ్వరి పుట్టెడు దుఃఖంలోనే ఒప్పుకుంది. నర్సింహారావు గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లు దానం చేసారు. ఇంత దుఃఖంలో సైతం చేసిన ఈ గొప్ప పనికి రాజేశ్వరిని గ్రామం మొత్తం అభినందించింది. నర్సింహారావు మృతదేహానికి యడవల్లిలో దహన సంస్కారాలు జరిగాయి. వీరికి ఏడు సంవత్సరాల కూతురు సాయియశశ్వని ఉంది.

2392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles