భారీ డిస్కౌంట్ల పేరుతో బురిడీ..

Sat,June 15, 2019 08:46 AM

online offer huge discounts fraud in hyderabad

హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ మోసాలకు పాల్పడే ఈ-కామర్స్ వెబ్‌సైట్లపై అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రయదర్శిని సూచించారు. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదులపై ఈ సందర్భంగా ఆమె వివరించారు. సైబరాబాద్ పరిధిలో నివాసముండే బాధితుడి సెల్‌ఫోన్‌కు ఈ నెల 11న హెచ్-మోన్‌టక్ పేరుతో ఎంఆర్‌పీ మీద 60 శాతం డిస్కౌంట్ ధరలకు మోంట్‌బ్లాక్ ఉత్పత్తులు లభిస్తున్నాయంటూ మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన https://www.montblancofficial.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.12 లక్షల విలువైన వస్తువులను ఎంపిక చేసుకున్నాడు, డిస్కౌం ట్ తరువాత రూ.503,140 చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ సంస్థ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి డెలివరీకి సంబంధించిన వివరాలను అడిగాడు. మొత్తం డబ్బు చెల్లించాలని, ఆ తరువాతే వస్తువులు మూడు రోజుల్లో సూచించిన చిరునామాకు డెలివరీ అవుతాయంటూ సూచించారు. దీంతో బాధితుడు వివిధ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆ డబ్బు చెల్లించాడు. తీరా ఇంటికి వచ్చిన వస్తువులను పరిశీలిస్తే అవన్నీ డూప్లికేట్ వస్తువులని తేలాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆమె వివరించారు. సాధారణ ప్రజలు ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు. డబ్బులు చెల్లించే ముందు ఆయా వెబ్‌సైట్లకు సంబంధించిన పూర్వపరాలు తెలుసుకోవాలని, ఇంటర్‌నెట్‌లో ఆయా వెబ్‌సైట్లకు సంబంధించిన మోసాలు కూడా తెలుసుకునే వీలుంటుందని సూచించారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని, మోసపోయిన తరువాత తేరుకోవడం కంటే.. మోస పోకుండా ఉండేవిధంగా తగిన జాగ్రత్తలతో షాపింగ్ చేయాలని ఆమె సూచించారు.

1770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles