వీడిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ

Fri,July 12, 2019 10:08 PM

old woman murder case solved in nalgonda dist

- బెల్ట్‌షాపు దందాలో అసూయే కారణం
- హత్యకు రూ.5వేల సుపారీ
- ముగ్గురు నిందితులు రిమాండ్
- విలేకరులకు వివరాలు వెల్లడించిన నకిరేకల్ రూరల్ సీఐ క్యాస్ట్రో

నల్లగొండ: జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో గత నెల 30న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బెల్ట్ షాపు దందా బాగా చేస్తుందన్న అసూయతో అదే వీధిలో అదే దందా చేసే మహిళ మరో ఇద్దరితో కలిసి హత్య చేయించినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నకిరేకల్ పట్టణంలోని తన కార్యాలయంలో రూరల్ సీఐ క్యాస్ట్రో విలేకరులకు కేసు పూర్వాపరాలు వెల్లడించారు. కొర్లపహాడ్ గ్రామానికి చెందిన సయ్యద్ ఆశాభీ(74) బెల్ట్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. అదే వీధిలో ముషం అంతమ్మ అనే మరో మహిళ సైతం అదే దందా చేస్తోంది. ఆశాభీ దందా బాగా నడుస్తుండడంతో అంతమ్మ ఆమెపై ఈర్ష పెంచుకుంది.

ఎలాగైనా ఆశాభీని అంతమొందించాలని పథకం వేసింది. పథకంలో భాగంగా తరుచూ తన వద్ద మద్యం తాగేందుకు వచ్చే కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన చింతల శ్రీనును సంప్రదించి హత్య చేసేందుకు రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా సాయం కోసం తన చెలెల్లు కూతురు నేరుడుచర్ల మండలవాసి ఉప్ప ధనలక్ష్మీని పిలిపించింది. పథకంలో భాగంగా జూన్ 30 తెల్లవారుజామున 2గంటల సమయంలో చింతల శ్రీనివాస్ మద్యం సేవించేందుకు ఆశాభీ ఇంటికి వెళ్లి నిద్రలేపాడు. ఇంట్లోకి వెళ్లగానే సమీపంలోని గొడ్డలితో ఆమె తలపై బలంగా కొట్టాడు.

అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో మెడ భాగంలో దాడి చేయడంతో ఘటనాస్థలంలోనే ఆశాభీ మృతి చెందింది. దాడి జరుగుతున్న సమయంలో ఉప్ప ధనలక్ష్మి ఇంటి బయట కాపాలా ఉంది. ఉదయం ఘటనా వెలుగులోకి రావడంతో అనుమానాస్పద హత్యగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతమ్మ ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకుంది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో కేతేపల్లి ఎస్‌ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles