ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత

Thu,November 9, 2017 11:58 AM

oggu Katha chukka Sattaiah Passes away

జనగాం: తెలంగాణ జానపదం మూగబోయింది. ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య ఇవాళ కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో చుక్క సత్తయ్య నిష్ణాతుడు. 14 ఏళ్ల ప్రాయం నుంచే ఆయన ఈ కళలో రాణించాడు. ఒగ్గు కథను దేశవ్యాప్తంగా పాపులర్ చేయడంలో ఆయన విశేష పాత్ర పోషించాడు. దేశవ్యాప్తంగా సుమారు 12 వేల ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.

శివ స్వరూపమైన వీర భద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ అంటారు. పరమశివుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయన అనేక ప్రదర్శనలిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఆయన్ను సన్మానించారు. ఒగ్గు కథా గాన శైలిలో అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన పోరాటం చేశారు. ఉన్నత విద్య, ఫ్యామిలీ ప్లానింగ్, కట్న వ్యవస్థ, మూఢనమ్మకాలు, చెడు అలవాట్ల లాంటిపైన కూడా ఆయన ఒగ్గు కథతో ప్రదర్శనలు చేశారు.
తెలంగాణ పల్లెల్లో చుక్క సత్తయ్య పేరు వినని వారుండరు. వరంగల్‌జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురం గ్రామంలో చౌదరిపల్లి ఆగయ్య, సాయమ్మ దంపతులకు 15జూన్ 1936 సంవత్సరంలో జన్మించారు. 11 ఏళ్ల వయస్సులోనే పెళ్ళి చేసుకున్నారు. ఒకటో తరగతి వరకే చదువుకున్నా రు. తన ప్రతిభా పాటవాలతోనే ఒగ్గు కథను రక్తికట్టించేటట్లు చేసిండు. సంప్రదాయ వృత్తి కళాకారుల శైలికి భిన్నంగా కొత్త శైలి రూపొందించిండు.

ఇంటిపేరు చౌదరిపల్లి అయినా ఆయనను ఎవరు కూడా ఇంటి పేరుతో పిలువలేదు. నుదట రెండు పాదాల మాదిరిగా (చుక్క) ఉంది. ఆ ‘చుక్క’ సత్తయ్య ఇంటి పేరుగా మారింది. చుక్క సత్తయ్య ప్రదర్శనలు అనేకం. మల్లన్నకథ, బీర ప్ప కథ, ఎల్లమ్మకథ, మాందాలు కథ, నల్ల పోషమ్మ కథ, కీలుగుర్రం కథ, లక్ష్యాగృహం కథ, పెద్దిరాజు కథ, ఎర్రగొల్ల అక్కమ్మకథ, కనకతార కథ, కాంభోజరాజు కథ, అల్లిరాణి కథ, గయోపాఖ్యానం, రంభ రంపాలా, అయిదు మల్లెపూల కథ, గౌడ పురాణం, సమ్మక్క కథ, మండోదరి కథ, ఇప్పరాపురిపట్నంకథ, సూర్యచంవూదాదుల కథ, బాల నాగమ్మ కథ, సత్యహరిశ్చంద్ర మహారాజు కథ, సత్యవతి కథ, సిరికొండ మహారాజు కథ, రామాయణం, మయసభ, కంసవధ, భస్మాసుర వధ, భక్త ప్రహ్లాద మొదలైనవి ప్రధానమైనవి.


ఇరవై కథలకు పైగా క్యాసెట్ల రూపంలో వెలువడ్డాయి. మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, మధ్యవూపదేశ్, కర్ణాటక, మేఘాలయ, అరుణాచల్‌వూపదేశ్, అస్సాం, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చారు. మలేషియాలో కూడా ప్రదర్శనలిచ్చి తెలంగాణ కీర్తిని దశదిశలా చాటి చెప్పారు. చుక్క సత్తయ్యకు నాటకాలపై ఆసక్తి. ఒకసారి ఒగ్గు కథకులు ఊరికి వచ్చి ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆయనకు వాటిపై ఆసక్తి ఏర్పడింది.

దీంతో ఆయన నాటకరీతిలో ఒగ్గు ప్రదర్శనలను రక్తి కట్టించడం అలవర చుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ఆచార్య వంగాల గోపాలడ్డి చుక్క సత్తయ్య కళానైపుణ్యాన్ని గుర్తించి 2005లో విశ్వవిద్యాలయం ద్వారా ‘గౌరవ డాక్టరేట్’ అందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం అవార్డుతో సత్కరించింది. 2004లో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు రూ.50వేల నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి నుంచి ‘రాజీవ్‌గాంధీ’ అవార్డు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి హంస అవార్డు, మద్రాస్ వారి నుంచి కళాసాగర్ అవార్డు తదితర సత్కారాలు అందుకున్నారు. జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. ఒగ్గుకథ, ఒగ్గు డొళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.

ఇప్పటికీ తన సొంత ఊరు మాణిక్యాపూర్‌లో రెండు, మూడు ఒగ్గు కథ బృందాలు ప్రదర్శనలిస్తున్నాయి. చుక్క సత్తయ్య పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జానపద కళల శాఖలో ఇరువై ఏళ్లుగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. ఎంఏ స్థాయిలో విద్యార్థులకు జానపద కళల మీద, ముఖ్యంగా ఒగ్గుకథ పుట్టుపూర్వోత్తరాలు, ప్రదర్శన విధానాల్ని తెలియజేశారు. చుక్క సత్తయ్య జీవనం, ఒగ్గు కథ ప్రదర్శన విధానంపైన ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధన లు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం సత్తయ్యకు ప్రతి నెల రూ.10వేల పింఛను అందిస్తోంది.

4691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles