ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

Tue,June 19, 2018 11:52 AM

nerella venu madhav no more

వరంగల్ : తెలంగాణ మరో కళాకారుడిని కోల్పోయింది. మిమిక్రీ లోకం మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్(85) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేణుమాధవ్ ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు, అభిమానులు, మిమిక్రీ కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

డిసెంబర్ 28, 1932న వరంగల్ జిల్లాలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మీ దంపతులకు వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్ల వయసులోనే మిమిక్రీ కళారంగంలో వేణుమాధవ్ ప్రవేశించారు. ఆ తర్వాత దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళంలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు. 2001లో నేరెళ్ల వేణుమాధవ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1981లో శ్రీ రాజ - లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు వరించింది. ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీతో పాటు ఇగ్నో గౌరవ డాక్టరేట్ తో వేణుమాధవ్ ను సత్కరించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలంగాణ రికార్డుల పుస్తకం ఆధ్వర్యంలో నేరెళ్లను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ వేడుక ఆయన 83వ పుట్టిన రోజు సందర్భంగా హన్మకొండలో ఘనంగా జరిపారు. వేణుమాధవ్ పుట్టిన రోజు డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా ఆయన శిష్యులు జరుపుకుంటున్నారు. 1971లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేణుమాధవ్.. ఎమ్మెల్సీగా సేవలందించారు. నేరెళ్ల పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.మిమిక్రీకి నేరెళ్ల చిరునామా
మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీకి చిరునామా. భావితరాలకు మిమిక్రీ అందించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. మిమిక్రీలో వినూత్న ప్రయోగాలతో కొత్త ప్రక్రియ రూపొందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లొమా కోర్సు ప్రారంభించేందుకు నేరెళ్ల కృషి చేశారు. ఆ తర్వాత తెలుగు వర్సిటీలో మిమిక్రీ అధ్యాపకుడిగా సేవలందించారు. అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వెంట్రిలాక్విజం ప్రక్రియను రూపొందించారయన. ధ్వని అనుకరణ ప్రక్రియపై నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ కళ పుస్తకం రాశారు. మిమిక్రీ కళలో ఎంతోమంది శిష్యులను ఆయన తయారు చేసి భావి తరాలకు అందించారు. నేరెళ్ల ప్రతిభకు మెచ్చి శివదర్పణం సంపుటిని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆయనకు అంకితమిచ్చారు. నేరెళ్లపై ఐవీ చలపతిరావు, పురాణం సుబ్రమణ్యశర్మ పుస్తకాలు రాశారు.

నేరెళ్ల వేణుమాధవ్ నిర్వహించిన ముఖ్యమైన పదవులు
-ఎం.ఎల్.సీ (1972-78)
-ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
-సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78)
-సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు
-దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94)
-టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96)
-రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96)
-ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75)
-రవీంద్రభారతి కమిటీ సభ్యుడు (1974-78)
-ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76)

3585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS