ప్రాణాలను మింగేస్తున్న నిర్లక్ష్యం..

Fri,May 24, 2019 08:09 AM

negligence may reason to loss lives in road accidents


హైదరాబాద్ : రోడ్లపై జరుగుతున్న యాక్సిడెంట్‌లను చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుంటే చాలు రోడ్లపై వాహనాలు నడుపాలంటే భయం వేస్తుంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకుంటే మనలో కలవరం అవుతుంది. ఇలా ఊహలు, ఆలోచనలతో నగరంలో రోడ్లపై వాహనాలు నడుపాలంటేనే ఓ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంటుంది. ప్రతీరోజు వాహనదారులను కుటుంబ సభ్యులు జాగ్రత్తా.. జాగ్రత్తా...అంటూ చెప్పి పంపించాల్సి వస్తుంది. ఎంత చెప్పినా చాలా మంది వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడంలో ఆసక్తి చూపడం లేదు. చెప్పితే సోది అంటూ యువకులు పెద్దల మాటలను కొట్టిపారేస్తున్నారు. దీంతో ఆ ఇంట్లో వారు తమ సభ్యుడు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేందుకు దేవుళ్లకు దండం పెడుతూ ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు. ఇలా వాహనదారుడు ఒక్కరే కాడు రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరికి వాహనాలను నడుపుతున్న తీరుతో ప్రాణ గండమే.

రోడ్లపై ఏర్పడ్డ గుంతలు కూడా ప్రాణ సంకటమే..రోడ్లపైకి వచ్చే ఆవులు, కుక్కలు, పందులు కూడా మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ సంఘటనలకు కారణాలను పరిశీలిస్తే అవి చాలా చిన్నవి. ఓ నిమిషం ఆలోచించి వాటిని విశ్లేషించుకుంటే మీరు ఇంటికి ప్రతి రోజు క్షేమంగా చేరడంతోపాటు ఇతరులకు కూడా మీ డ్రైవింగ్‌తో భరోసాను ఇవ్వొచ్చనేది స్పష్టం. దీనికి ముందుగా నిర్లక్ష్యం, అజాగ్రత్తా, అతివేగాన్ని వీడాల్సిన అత్యవసరం ఉంది. ఇటీవల సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్డు ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌ మానిటరింగ్‌ సెల్‌ చేసిన అధ్యయనంలో చిన్న చిన్న కారణాలతో జరుగుతున్న ప్రమాదాలను గుర్తించారు. ఆ తప్పులను జరుగకుండా ఉండేందుకు వాహనాదారుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆటో వెనకాల కూర్చోవడమే.. ప్రాణం తీసింది..


శామీర్‌పేట్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రావు సెవెన్‌ సీటర్‌ ఆటో వెనకాల కూర్చొని ప్రయాణిస్తున్నాడు. ఆటో డ్రైవర్‌ ఓవర్‌ స్పీడుతో ప్రయాణిస్తున్నాడు. దీంతో ఓ సందర్భంలో ఆటో కుదిపింది. ఈ పరిణామంతో వెనకాల కూర్చున్న శ్రీనివాస్‌రావు కింద పడి తీవ్ర గాయాలకు గురై చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన మార్చి నెలలో శామీర్‌పేట్‌ పీఎస్‌లో చోటుచేసుకుంది. ఆటోలో వెనకాల కూర్చొని ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధమే..

రోడ్డు మధ్యలో చెట్లకు నీళ్లు పోస్తుండగా..


బోయ వీరస్వామి తన ఆటోలో శామీర్‌పేట్‌ నుంచి కుకునూర్‌పల్లి గ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డుపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాటర్‌ ట్యాంకర్‌తో డివైడర్‌లో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్నారు. ఆటో నడిపిస్తున్న వీరస్వామి ట్యాంకర్‌ నడుస్తుందనుకుని అదే వేగంతో ముందుకు సాగాడు. దగ్గరకు వచ్చేసరికి ట్యాంకర్‌ ఆగి ఉందని గమనించి వేగాన్ని కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించినా అది కాలేదు. ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురై చికిత్స పొందుతూ మరణించాడు. ఇక్కడ వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్‌ అజాగ్రత్త ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ విధంగా సైబరాబాద్‌ రోడ్డు యాక్సిడెంట్‌ ట్రాఫిక్‌ మానిటరింగ్‌ సెల్‌ చేసిన అధ్యయనంలో ఏప్రిల్‌ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో స్వల్ప తప్పులతో వాహనదారులు, పాదచారులు ప్రాణాలు గాల్లో కలిశాయని స్పష్టమైంది. దీని కోసం ఈ బృందం ప్రమాదాలు జరిగిన స్పాట్స్‌, సంఘటనలు చూసిన ప్రత్యక్ష సాక్షులు, సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ప్రమాదాల కారణాలు చాలా చిన్నవని, వాటిని నియంత్రించేందుకు క్రమశిక్షణతో కూడిన డ్రైవింగే సేఫ్‌ అని తేల్చారు.

2255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles