ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం నేటితో పూర్తి

Wed,July 3, 2019 09:21 AM

MPTCs and MPPs tenure end today

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం నేటితో ముగియనున్నది. 427 మంది ఎంపీపీలు, 6,473 మంది ఎంపీటీసీలు తమ ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. గురువారం మండలాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పాతసభ్యుల పదవీకాలం ఉండగానే.. రాష్ట్రప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించింది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నాలుగు పర్యాయాలు జరిగినప్పటికీ.. పదవీకాలం ముగియకముందే ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు లేవు. పదవీ కాలం ముగిశాక ఆర్నెళ్లకో, ఏడాదికో ఎన్నికలు జరిగేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఎన్నికలు నిర్వహించి చరిత్ర సృష్టించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చాక మండలాల్లో కొలువుదీరనున్న తొలి పాలకవర్గాలుగా గురువారం బాధ్యతలు స్వీకరించేవారు రికార్డులకెక్కనున్నారు.

మండలాల పునర్విభజన తరువాత రాష్ట్రంలో మండల పరిషత్‌ల సంఖ్య పెరుగగా.. మండల ప్రాదేశిక సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో చిన్న గ్రామపంచాయతీకి ఒకరు, పెద్ద పంచాయతీల్లో ఇద్దరు చొప్పున ఎంపీటీసీలు ఉండగా.. ఈసారి సరాసరి 3 వేల ఓటర్లకు ఒక సభ్యుడిని ఎన్నుకున్నారు. దీంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. పాత రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 6,473 మండల పరిషత్ ప్రాదేశిక సెగ్మెంట్లు ఉండగా.. కొత్తచట్టం ప్రకారం 5,857 స్థానాలకు తగ్గాయి. వీటిలో కోర్టు కేసులు, ఇతర కారణాలతో 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 5,817 ఎంపీటీసీ స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకున్నారు. మండలాల సంఖ్య 427 నుంచి 539కి పెరిగింది. గత నెల 7న ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. కో-ఆప్షన్ సభ్యులను సైతం నామినేట్ చేశారు.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles