రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి :ఎంపీ గుత్తా

Sun,October 21, 2018 09:37 PM

mp gutta sukhender reddy fire on congress party

రామగిరి : కాంగ్రెస్ పాలనలోనే అవినీతి జరిగింది, ఆ పార్టీదే కుటుంబ పాలన సాగింది.. రాహుల్‌గాంధీ ఈ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు రాసిన స్క్రిప్టును రాహుల్ చదివాడే తప్ప అందులో ఎంత వాస్తవముందో తెలుసుకోలేక పోయాడని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో ఈపీఎస్ విధానం మొబిలైజేషన్ పేరుతో అవినీతికి దారులు తెరిచింది కాంగ్రెస్ నాయకులే అని.. దానిపై అప్పట్లో రాహుల్‌గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు.

ఇన్ని రోజుల పాటు టీడీపీలో ఉండి కాంగ్రెస్‌పై చిందులు తొక్కిన రేవంత్‌రెడ్డి.. గతంలో రాజశేఖర్‌రెడ్డి పాలనలో రాజా కరప్షన్ పుస్తకాన్ని తయారు చేసి రాష్ట్రపతికి అందించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మహాకూటమి పేరుతో నేడు దోస్తులుగా మారుతున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు గతాన్ని మర్చి పోయాయని.. వారు మారినంత మాత్రానా చరిత్ర మారదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం కాస్తా ధనయజ్ఞంలా మారిందని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులు మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్‌తోనే ఎలా పొత్తు పెట్టుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గత సమైక్య పాలకులు తనను ఎన్‌కౌంటర్ చేయడానికి ప్రయత్నించారని, వారి వల్లే తన వెన్నుపూసలో బుల్లెట్ దిగిందని చెప్పుకున్న ప్రజా గాయకుడు గద్దర్ నేడు కుటుంబ సమేతంగా రాహుల్‌గాంధీని కలవడంలో ఆంతర్యమేమిటో ప్రజలకు తెలపాలన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా, మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తానంటూ ప్రకటించిన గద్దర్ తన విలువలను తానే దిగజార్చుకుంటున్నారని విమర్శించారు.

సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క ఎన్‌కౌంటర్ కూడా జరగలేదని గుర్తు చేశారు. టీపీసీసీ అధినేత ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి, తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్న జానారెడ్డి, తన కుమార్తెకూ టికెట్ ఇప్పించేందుకు యత్నిస్తున్న డీకే అరుణ, దామోదరం రాజనర్సింహ కూడా ఆయన సతీమణికి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలా కుటుంబ పాలన సాగించానే కాంగ్రెస్ నాయకులు టికెట్ల కోసం పాకులాడుతున్నారని, ఇలా ఉన్న 119 స్థానాల్లో 60 స్థానాలు వారివే అవుతుంటే కుటుంబ పాలన ఎవరిదో తెలిపోతుందని పేర్కొన్నారు. సమావేశంలో టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ మాలే శరణ్యారెడ్డి, టీఆర్‌ఎస్ నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థులు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, నలబోతు భాస్కర్‌రావు పాల్గొన్నారు.

861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS