విద్యుదాఘాతంతో తల్లీకొడుకు దుర్మరణం

Sun,May 20, 2018 09:25 PM

Mother and son death with current shock

నేరేడుచర్ల : విద్యుదాఘాతంతో తల్లి, కొడుకు దుర్మరణం చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో సాయంత్రం చోటు చేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. స్థానిక హుజూర్‌నగర్ రోడ్డులోని అట్టల ఫ్యాక్టరీ సమీపంలో ఉపాధి హామీ మొక్కల నర్సరీని చింతల చెర్వు లక్ష్మీ(50) ఆమె కుమారుడు చింతల చెర్వుగోపి(24) నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగా వారు మొక్కలకు నీళ్లు పెడుతుండగా నర్సరీకి రక్షణగా వేసిన ఇనుప కంచెకు విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ ప్రసరించడంతో గోపి విద్యుత్ షాక్ గురయ్యాడు.

నర్సరీలోనే మరో పక్క నీళ్లు పెడుతున్న తల్లి లక్ష్మీ గమనించి ఆతృతతో గోపిని లాగేందుకు ప్రయత్నించగా ఇరువురి విద్యుత్ షాక్ గురై అక్కడిక్కడే మృతి చెందారు. నేరేడుచర్ల ఎస్‌ఐ నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా దవాఖానకు తరలించారు. లక్ష్మీ మధ్యాహ్నం స్థానిక చర్చిలో ప్రార్థనలు చేసింది. కుమారుడు గోపి తన స్నేహితులతో అప్పటి వరకు క్రికెట్ ఆడుకుంటూ సరదాగా గడిపాడు. ఇంతలోనే మృత్యువు విద్యుత్ రూపంలో వారి ఇరువురిని మింగివేయడం పులువురిని కలిచివేసింది. లక్ష్మికి ముగ్గురు వివాహిత కూతుర్లు ఉన్నారు. వారి అనంతరం గోపి ఏకైక కుమారుడు. లక్ష్మీ భర్త నర్సింహారావు, బంధువుల రోదనలతో విషాదచాయలు అలుముకున్నాయి.

4874
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS