ఎస్సీలకు మొబైల్ టిఫిన్ సెంటర్లు

Tue,December 3, 2019 07:03 AM

హైదరాబాద్ : తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడే మనిషోయ్.. అన్నాడు గురజాడ. అన్నట్లుగా మన వారు తిండికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి తగినట్లుగానే ఆహారం ఎక్కడపడితే అక్కడ హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు వెలుస్తూ..పుష్కలంగా దొరుకుతుంది. నలుగురి కడుపునింపి నాలుగురాళ్లు వెనకేసుకునే వారు భోజన ప్రియులు ఉన్నచోటే ఉంటూ క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రొత్సాహకాలిచ్చేందుకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ముందుకొచ్చింది. స్వయం ఉపాధి పథకాల కింద మొబైల్ టిఫిన్ సెంటర్ల ఏర్పాటుకు సబ్సిడీ రుణాన్నిచ్చి సాయమందించనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికచేసి ఎస్సీలకు మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేయబోతున్నారు. ప్రస్తుతానికి 20 వ్యక్తిగతయూనిట్లను జిల్లాకు కేటాయించారు. వీటి పనితీరును బాగుండి.. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఆదాయం మెండుగా ఉంటే మరికొన్ని యూనిట్లను మంజూరుచేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ యూనిట్లు విజయవంతంగా నడిస్తే.. లబ్ధ్దిదారులకు మంచి ఆదాయం లభిస్తే దశల వారీగా ఈ ఇలాంటి యూనిట్లను రాష్ట్రమంతా నెలకొల్పేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. కొంత మొత్తాన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇవ్వనుండగా, మరికొంత మొత్తాన్ని బ్యాంక్ రుణంగా సమకూర్చనున్నారు. ఇందు కోసం జిల్లా ఎస్సీ కార్పోరేషన్ అధికారుల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేశారు.
యూనిట్ వ్యయం వివరాలు..
ఒక్కో యూనిట్‌కు వ్యయం : రూ. 6,99, 652
సబ్సిడీగా అందించే మొత్తం : రూ. 4,19,791
బ్యాంక్ రుణం : రూ. 2, 79,861
వాహనంలోనే అన్ని వంట సామాగ్రి, ఇన్వెర్టర్, స్టవ్, బిగించి ఇస్తారు.
అర్హతలు..
- 8వ తరగతి పూర్తిచేసి ఉండాలి.
- వయస్సు 21 -50 సంవత్సరాల లోపు
- హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులై మాత్రమే ఉండాలి.
- తాసీల్దార్ జారీచేసిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని జతపరచాలి.
- వార్షికాదాయం రూ. 2లక్షల లోపు ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తారు.
- రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జతపరచాలి.
- హోటల్ వ్యాపారంలో ఏదైనా ధ్రువపత్రం, లేదంటే టిఫిన్లు తయారు చేయడంలో అనుభవం కలిగిఉండాలి.
16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు: -బి. మాన్యానాయక్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్‌లో ఎస్సీ నిరుద్యోగ యువతకు మొబై ల్ టిఫిన్ సెంటర్లు ఇవ్వబోతున్నాం. ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి అర్హులైన వారిని ఎంపిక చేస్తాం. ఆసక్తిగల వారు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు పూరించి సమర్పించాలి.

953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles