ఉద్యమ గొంతుక.. శ్రీనివాస్ గౌడ్

Tue,February 19, 2019 12:26 PM

MLA Srinivas Goud Take Oath as Minister

పూర్తి పేరు : విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌
పుట్టిన తేదీ : 1969, మార్చి 16
తల్లిదండ్రులు : శాంతమ్మ, నారాయణగౌడ్‌
భార్య : శారద
కుమార్తెలు : శ్రీహిత, శ్రీహర్షిత
స్వగ్రామం : రాచాల(అడ్డాకుల)
విద్యార్హత : బీఎస్సీ, ఎంసీజే
ఉద్యోగ అనుభవం : మున్సిపల్‌ శాఖలో కమిషనర్‌
ఇతరాలు : జేఏసీ కోచైర్మన్‌, టీజీవోస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు
చేపట్టిన శాఖ: ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు


హైదరాబాద్ : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉద్యోగ సంఘాలను ఏకం చేసిన నేతగా శ్రీనివాస్ గౌడ్ అందరికీ సుపరిచితుడు. సమైక్య పాలనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన గొంతుక ఆయన. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రారంభించి అదే వేదికగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం సాగించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడా వెరవకుండా రాష్ట్ర సాధన కోసం పోరాటం సాగించారు. ఉద్యమం కోసం జైలుకు కూడా వెళ్లారు. కేసీఆర్‌కు వెన్నంటే ఉండి ఉద్యమంలో శ్రీనివాస్‌ గౌడ్‌ చేసిన పోరాటమే ఆయనకు శ్రీరామరక్ష అయింది. 2014లో మహబూబ్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీనివాస్‌ గౌడ్‌ కొంతకాలం పార్లమెంటరీ కార్యదర్శిగా క్యాబినెట్‌ హోదాలోనూ పనిచేశారు. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. కేబినెట్‌ పదవి లేదని ఏనాడు చింతించలేదు. కష్టపడి ప్రజల కోసం పనిచేస్తే పదవులు వాటికంతట అవే వస్తాయని నమ్మారు. అందుకే ఎప్పుడూ నియోజకవర్గం మీదే దృష్టి పెట్టారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. తిరిగి రెండో సారి కూడా మహబూబ్‌ నగర్‌ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీనివాస్‌ గౌడ్‌... ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే అత్యధిక మెజార్టితో విజయం సాధించారు. ఉద్యమంలో కష్టపడి పనిచేయడం, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవడం, గతంలో మంత్రి పదవి దక్కకపోయినా ఓపికగా ఎదురుచూడటం... ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. అందుకే ఆయనకు సీఎం కేసీఆర్‌ కేబినెటే మంత్రిగా అవకాశం కల్పించారు.

ఉద్యమ నేపథ్యం..
ఉద్యమంలో శ్రీనివాస్‌ గౌడ్‌ అంటే తెలియని వారు లేరు. ఎక్కడ పోరాటం అన్నా ఆయన వెంటనే ప్రత్యక్షం అయ్యేవారు. రాష్ట్ర సాధనే ఆయన అజెండా.. అందుకు పోరాటం తప్ప వేరే మార్గం లేదని నమ్మారు. కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటి సమైక్య ప్రభుత్వం ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపినా... ఎన్నడూ బెదరలేదు అదరలేదు.. ఉద్యమంలో అరెస్ట్‌ అయినా కూడా ఆయన వెరవలేదు. రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర సాధన కోసం పోరాడారు. తన సాటి ఉద్యోగులు, సంఘాల నేతలకు అండగా ఉంటూ ఉద్యమాన్ని ఊపిరిగా కొనసాగించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం అంతాఇంతా కాదు. సమైక్య పాలనలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఉద్యమకారులను వేధించారు. భయభ్రాంతులకు గురిచేశారు. ఉద్యమంలో ఉన్న ఉద్యోగులను ఎవరైనా బెదిరిస్తే శ్రీనివాస్‌ గౌడ్‌ వారిపై ఒంటికాలితో లేచేవారు. వారందరికీ అండగా ఉంటూ ఉద్యమం ఎక్కడా చల్లారకుండా జాగ్రత్త పడ్డారు.

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కూడా అదే పద్ధతి ఆయనది. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ వచ్చారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేశారు. మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాల, ఐటీ పార్క్‌, మయూరి పార్క్‌, పెద్దచెరువు సుందరీకరణ, ఆక్రమణల తొలగింపు, అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూంలు, పట్టణంలో రోడ్లు, తాగునీరు, మౌలిక వసతుల కల్పన... ఇలా ఒక్కటేమిటి లెక్కలేనన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల్లో పార్టీకి ఎంతో మంచి పేరు తీసుకువచ్చారు. గతంలో తాగునీరు 15 రోజులకోసారి వచ్చేది. అలాంటిది శ్రీనివాస్‌ గౌడ్‌ ఎమ్మెల్యే అయ్యాక రోజు విడిచి రోజు వచ్చేలా చేశారు. మహాకూటమి పేరిట పార్టీలన్ని ఏకమై పోటీలో నిలిచినా ఆయన చేతిలో కూటమి అభ్యర్థికి ఘోర పరాజయం ఎదురైంది. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో శ్రీనివాస్‌ గౌడ్‌ విజయం సాధించారు. ఆయన కష్టం, ప్రజల పట్ల అంకిత భావం, నియోజకవర్గం కోసం పనిచేసే తత్వం, మహబూబ్‌ నగర్‌ అభివృద్ధికి చేసిన కృషి వల్లే మళ్లీ గత ఎన్నికల్లో ఆయనకు అంతటి ఘన విజయం సాధ్యమైంది. అందరివాడిగా పేరుపొందిన శ్రీనివాస్‌ గౌడ్‌... ఉద్యమంలో కష్టపడిన తీరు, ఆది నుంచి పార్టీ కోసం చేసిన కృషి, సీఎం కేసీఆర్‌ కు అత్యంత నమ్మకంగా వ్యవహరించడం, ఆయన సమర్థత కూడా కలిసివచ్చింది.

2398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles