మిషన్ కాకతీయ 4వ దశకు సన్నాహాలు

Wed,November 29, 2017 06:44 AM

Mission kakatiya fourth phase works start from January

హైదరాబాద్: మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను జనవరి మొదటివారంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు పొందే ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 28 చెరువుల పునరుద్ధరణకుగాను రూ.4.97 కోట్ల అంచనా వ్యయంతో మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఫైల్‌పై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సంతకం చేసినట్టు నీటిపారుదలశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వెంటనే ఈ పనులకు సాంకేతిక అనుమతులిచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. మిషన్ కాకతీయ నాలుగో దశ టైం లైన్లను విధిగా పాటించాలని స్పష్టంచేశారు. డిసెంబర్ 15కల్లా చీఫ్ ఇంజినీర్ కార్యాలయం అంచనాలను పాలనాపరమైన అనుమతి కోసం పంపాలని ఆదేశించారు.

డిసెంబర్ 31 వరకు పాలనా అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌ను మంత్రి కోరారు. జనవరి మొదటివారంలో చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాలని మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో, మూడో దశలో ప్రారంభించి పూర్తికాకుండా మిగిలిపోయిన చెరువులను కూడా పూర్తిచేసి తుది బిల్లులు చెల్లించాలని ఇంజినీర్లకు సూచించారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని హెచ్చరించారు. మిషన్ కాకతీయ నాలుగో దశ పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు.

2542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles